55,800-56,200 శ్రేణిలో మద్దతు!

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో వారం సూచీలు డీలాపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపులతో అంతర్జాతీయ మాంద్యం రావొచ్చన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి.

Published : 03 Oct 2022 02:18 IST

సమీక్ష: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో వారం సూచీలు డీలాపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపులతో అంతర్జాతీయ మాంద్యం రావొచ్చన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, డాలర్‌ సూచీ రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరడం, రూపాయి జీవనకాల కనిష్ఠమైన 81.96కు పడిపోవడం మార్కెట్లను ఒత్తిడికి గురిచేశాయి. అయితే ఆర్‌బీఐ పరపతి నిర్ణయాల తర్వాత సూచీలు కొంత కోలుకున్నాయి. దేశీయంగా చూస్తే.. కార్పొరేట్‌ వార్తలు, ప్రకటనలతో షేరు, రంగం ఆధారిత కదలికలు కొనసాగాయి. ఆర్‌బీఐ అంచనాలకు అనుగుణంగా కీలక రెపో రేటును 0.50 శాతం పెంచి 5.9 శాతం చేసింది. ఏప్రిల్‌-ఆగస్టులో ద్రవ్యలోటు 5.41 లక్షల కోట్లుగా నమోదైంది. రష్యా ఉత్పత్తి తగ్గించొచ్చన్న వార్తలతో బ్యారెల్‌ ముడిచమురు 2.1 శాతం పెరిగి 87.9 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 80.99 నుంచి 81.34కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా తయారీ పీఎంఐ వృద్ధి చెందగా, సేవల పీఎంఐ నిరాశపరిచింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 65 బి.పౌండ్ల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. యూరో జోన్‌ ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ఠమైన 10 శాతానికి చేరింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.2 శాతం నష్టంతో 57,427 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.3 శాతం తగ్గి 17,094 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, లోహ, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, మన్నికైన వినిమయ వస్తువుల స్క్రిప్‌లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.15,862 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.15,988 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. సెప్టెంబరులో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మొత్తంగా రూ.7,624 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:1గా నమోదు కావడం..
ఇటీవలి నష్టాల తర్వాత ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గత వారం 56,147 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, కొంత నష్టాలను తగ్గించుకోగలిగింది. స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 55800 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు. మరోవైపు 58,100 వద్ద తక్షణ నిరోధం, 58,700 పాయింట్ల వద్ద కీలక నిరోధం ఎదురుకావొచ్చు. 55,800- 56,200 శ్రేణిలో మద్దతుతో మార్కెట్‌ స్థిరీకరణకు గురికావచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ సంకేతాలతో సూచీలు ఒడుదొడుకుల మధ్య స్థిరీకరించుకోవచ్చు. బుధవారం దసరా సెలవు కావడంతో మార్కెట్లు ఈవారం నాలుగు రోజులే పనిచేయనున్నాయి. రూపాయి కదలికలు, నెలవారీ వాహన విక్రయాలు, టెలికాం చందాదారుల గణాంకాలు, 5జీ సేవల ప్రారంభం వంటివి సూచీలపై ప్రభావం చూపొచ్చు. సెప్టెంబరులో మెరుగైన విక్రయాలు నమోదు కావడంతో వాహన షేర్లు వెలుగులోకి రావొచ్చు. ఈసారి వర్షపాతం దీర్ఘకాల సగటులో 106 శాతం నమోదైంది. ఎగుమతులు- దిగుమతులు, రుణాల వృద్ధి, తయారీ, సేవల పీఎంఐ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల తయారీ పీఎంఐ, అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఫ్యాక్టరీ ఆర్డర్లు, నిరుద్యోగ రేటు, ఈసీబీ సమావేశంపై కన్నేయొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి కూడా సంకేతాలు తీసుకోవచ్చు. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగితే సెంటిమెంట్‌ బలహీనపడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 56,900; 56,147; 55,800
తక్షణ నిరోధ స్థాయులు: 58,100; 58,700; 59,144
సెన్సెక్స్‌కు 55,800-56,200 శ్రేణిలో మద్దతు లభించొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని