87 ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలు.. రూ.1,460 కోట్ల సమీకరణ!

ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో 87 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్‌ఎమ్‌ఈలు) తొలి పబ్లిక్‌ ఇష్యూల (ఐపీఓలు) ద్వారా రూ.1,460 కోట్ల నిధుల్ని సమీకరించాయి. ఈ విభాగం నుంచి గతంలో వచ్చిన ఐపీఓలు విజయవంతం కావడంతో మదుపర్లు కొత్త వాటిపైనా ఆసక్తి ప్రదర్శించారని తెలుస్తోంది.

Updated : 03 Oct 2022 09:29 IST

గతేడాదితో పోలిస్తే భారీ స్పందన

దిల్లీ: ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో 87 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్‌ఎమ్‌ఈలు) తొలి పబ్లిక్‌ ఇష్యూల (ఐపీఓలు) ద్వారా రూ.1,460 కోట్ల నిధుల్ని సమీకరించాయి. ఈ విభాగం నుంచి గతంలో వచ్చిన ఐపీఓలు విజయవంతం కావడంతో మదుపర్లు కొత్త వాటిపైనా ఆసక్తి ప్రదర్శించారని తెలుస్తోంది. 2021 పూర్తి ఏడాదిలో వచ్చిన 56 కంపెనీల ఐపీఓలతో పోలిస్తే ఈ ఏడాది 9 నెలల్లోనే అత్యధికంగా ఐపీఓలు రావడం విశేషం. 2021లో రూ.783 కోట్ల నిధుల్ని మాత్రమే కంపెనీలు సమీకరించాయి.

3 నెలల్లో మరిన్ని ఐపీఓలు

ఈ ఏడాది ఇంకా 3 నెలలు మిగిలి ఉండగా, మరిన్ని కంపెనీలు ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదు కావడానికి రాబోతున్నాయి. టెక్‌ ఆధారిత, పెద్ద బ్రోకింగ్‌ సంస్థలు ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఫెడెక్స్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ నాయర్‌ వెల్లడించారు. ఎస్‌ఎమ్‌ఈ కంపెనీలకు ఈ ఏడాది చాలా బాగుందని, ఎక్స్ఛేంజీ నుంచి భారీగా నిధులు సమీకరించాయని పేర్కొన్నారు.

* స్టాక్‌ మార్కెట్‌లో బేరిష్‌ ధోరణి కొనసాగుతున్నా, ఎస్‌ఎమ్‌ఈ విభాగంపై పెద్దగా ప్రభావం కనిపించలేదని, మదుపర్లు ఈ తరహా ఐపీఓలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారని హేమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ వెల్లడించారు. చాలా కంపెనీలు బీఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌లపై నమోదయ్యేందుకు ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయని తెలిపారు.

* ఈ ఏడాది వచ్చిన 87 ఐపీఓల్లో ప్రధానంగా ఐటీ, ఆటోమోటివ్‌ విడిభాగాలు, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆతిథ్య, ఆభరణాల కంపెనీలున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

* సెకండరీ మార్కెట్‌లో ఒడుదొడుకులు ఉన్నా, ఒక్క సెప్టెంబరు నెలలోనే 29 ఎస్‌ఎమ్‌ఈలు ప్రాథమిక మార్కెట్‌కు రావడం విశేషం. ఇందులో 25 ఐపీఓలు ముగియగా, 4 కొనసాగుతున్నాయి.

* చాలా ఐపీఓలకు అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐఐ)తో పాటు రిటైల్‌ మదుపర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఇన్సొలేషన్‌ ఎనర్జీ ఐపీఓకు ఏకంగా 183 రెట్ల ఆదరణ లభించడం విశేషం. ఇప్పటివరకు బీఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓల్లోనే ఇదే అత్యధిక స్పందన.

* బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు 2012లో ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌పామ్‌లను ప్రారంభించాయి. వీటి ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలు తమ వృద్ధి, విస్తరణ కోసం మూలధనాన్ని సమీకరిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts