లాభాలు కనిపించొచ్చు

స్టాక్‌ మార్కెట్లలో గత వారం కనిపించిన ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Published : 03 Oct 2022 02:22 IST

ఆర్‌బీఐ వ్యాఖ్యలతో సానుకూలతలు
ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫార్మా రాణించొచ్చు
దసరా రోజున మార్కెట్లకు సెలవు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

స్టాక్‌ మార్కెట్లలో గత వారం కనిపించిన ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఆధారంగా కదిలే(సైక్లికల్‌) షేర్లు, వినియోగదారు రంగాల్లో కొనుగోళ్లు కనిపించొచ్చని అంటున్నారు. బుధవారం ‘విజయదశమి’ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. గత కొద్ది వారాలుగా విక్రయాలు చేస్తున్న దేశీయ సంస్థాగత, రిటైల్‌ మదుపర్లు భారత్‌ 7% వృద్ధిని సాధిస్తుందన్న ఆర్‌బీఐ వ్యాఖ్యలతో కొనుగోళ్లకు దిగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ 17,000 పాయింట్లను తిరిగి సాధించడం కూడా సానుకూలతలను తీసుకురావొచ్చు. 17,500-17,700 స్థాయిలో నిరోధం; 17000-16850 వద్ద మద్దతు కనిపిస్తోందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు కంపెనీల షేర్లలో బలహీనతలు కొనసాగొచ్చు. 2022-23లో ఆపరేటింగ్‌ మార్జిన్లు 15% మేర తగ్గొచ్చన్న క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనాలు ఇందుకు కారణం. ముడి పదార్థాల వ్యయ భారం తగ్గుతున్నా.. బలహీన ధరలు, స్తబ్దుగా ఉన్న గిరాకీ వల్ల మధ్య కాలంలో ఈ కంపెనీలపై ప్రభావం కనిపించొచ్చు.

* రక్షణాత్మక కొనుగోళ్లు కనిపించొచ్చన్న అంచనాల మధ్య ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించొచ్చు. ఇతర రంగాల్లో లాభాల స్వీకరణ కారణంగా ఫార్మా, వినియోగదారు వస్తువుల వంటి షేర్లపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.

* రెపో రేటు పెంపు జరిగినా.. బ్యాంకు షేర్లలో కొంత మేర లాభాలు కనిపించొచ్చు. గత కొద్ది రోజులుగా కొన్ని బ్యాంకు షేర్లలో దిద్దుబాటు జరగడం వల్ల ఇపుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమని భావిస్తున్నారు.

* యంత్ర పరికరాల షేర్లు కొంత సానుకూలంగా/తటస్థంగా కనిపించొచ్చు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉన్నప్పటికీ.. మార్కెట్‌పై ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది.

* లోహ షేర్లు గత వారం భారీ ఒత్తిడికి లోనయ్యాయి.

* ఐటీ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు. ఈ నెల రెండో వారంలో మొదలయ్యే ఫలితాల కోసం మదుపర్లు వేచిచూస్తుండడమే ఇందుకు నేపథ్యం. గిరాకీ తగ్గవచ్చన్న అంచనాల మధ్య భారీ పొజిషన్లకు వీరు దూరంగా ఉండొచ్చు.

* సెప్టెంబరు విక్రయాల ప్రభావం వాహన కంపెనీల షేర్లపై కనిపించొచ్చు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధనను అక్టోబరు 2023కు ప్రభుత్వం వాయిదా వేయడం వల్ల కంపెనీలకు ఊరట లభించొచ్చు.

* ఎంపిక చేసిన టెలికాం కంపెనీల షేర్లలో కదలికలు కనిపించొచ్చు. 5జీ సేవలు కొన్ని నగరాల్లో ప్రారంభమయ్యాయి. జియో, ఎయిర్‌టెల్‌ల సేవలు ఈ నెలలోనే మొదలుకానుండగా.. వొడాఫోన్‌ ఐడియా ఇంకా ఎపుడు ప్రారంభించేదీ చెప్పలేదు.

* అంతర్జాతీయ ముడి చమురు ధరల ధోరణిని అనుసరించి ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా షేర్లు కదలాడవచ్చు. చమురు ధరలు ప్రతికూల ధోరణితో ఊగిసలాటలకు గురికావొచ్చన్న అంచనాలున్నాయి. సహజ వాయువు ధరలు పెరిగిన నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేర్లు రాణించొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని