విశ్వసనీయతే మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం

నేటి ప్రపంచంలో నమ్మకమే అన్నింటికంటే ముఖ్యమని, దాన్ని బీవీఆర్‌ మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ, జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి రాసిన ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా... ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిల్డింగ్‌ బిలియన్‌ డాలర్‌’ పుస్తకాన్ని ఆయన సోమవారం రాత్రి ఇక్కడ విడుదల చేసి మాట్లాడారు.

Published : 04 Oct 2022 02:09 IST

పుస్తకావిష్కరణలో అమితాబ్‌ కాంత్‌

ఈనాడు, దిల్లీ: నేటి ప్రపంచంలో నమ్మకమే అన్నింటికంటే ముఖ్యమని, దాన్ని బీవీఆర్‌ మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ, జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి రాసిన ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా... ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిల్డింగ్‌ బిలియన్‌ డాలర్‌’ పుస్తకాన్ని ఆయన సోమవారం రాత్రి ఇక్కడ విడుదల చేసి మాట్లాడారు. ‘మోహన్‌రెడ్డి గొప్ప పారిశ్రామికవేత్త. వినూత్న ఆలోచనలు ఉన్న వ్యక్తి. అందుకే ఆయనంటే నాకు ఆరాధ్యభావం ఉంది. తన పనితీరుతో కేవలం ప్రైవేటు రంగంలోని వారినే కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న నాలాంటి వారిలోనూ స్ఫూర్తి నింపారు. దేశంలో ఇన్నోవేషన్‌ సరిహద్దులను పూర్తిగా పునర్నిర్వచించిన వారిలో మోహన్‌ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యం లోని సంస్థ ఇప్పుడు భారత్‌లో ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా ఉంది. ఒక్క చిన్న వినియోగదారు కూడా ఆయన కంపెనీని వదిలిపెట్టకపోవడం ప్రపంచవ్యాప్తంగా అది అందిస్తున్న విశ్వసనీయమైన సాంకేతిక సేవలను చాటుతోంది. ఇది మోహన్‌రెడ్డి వ్యక్తిత్వానికి అద్దంపడుతుంద’ న్నారు. పుస్తక రచయిత మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడం వెనుక ముఖ్య ఉద్దేశం దేశంలోని యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడమేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్‌ విధానం, మార్కెట్‌లోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలవల్ల మనకు ఎక్కువ అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో  యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం గురించి చెబుతూ పుస్తకం రాసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి నెలా పది లక్షలమంది యువత ఉద్యోగాల కోసం సిద్ధమవుతోందని, సంవత్సరానికి కోటిమంది ఉద్యోగాలకోసం వేచిచూసే పరిస్థితి ఉంటోందన్నారు. పది సంవత్సరాల్లో ఈ సంఖ్య పది కోట్లకు చేరుతుందని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటికీ సాధ్యం కాదన్నారు. అందువల్ల యువతే కొత్తగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే సమస్య పరిష్కారమవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని