ఎలక్ట్రానిక్స్‌ తయారీకి సాన్మినాతో రిలయన్స్‌ జట్టు

ఎలక్ట్రానిక్స్‌ తయారీ కోసం సంయుక్త సంస్థ ఏర్పాటుకు అమెరికాకు చెందిన సాన్మినా కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌బీవీఎల్‌ల మధ్య ఒప్పంద ప్రక్రియ పూర్తయింది.

Published : 05 Oct 2022 02:33 IST

సంయుక్త సంస్థ ఏర్పాటు ఒప్పందం పూర్తి
విలువ రూ.3,300 కోట్లు

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ తయారీ కోసం సంయుక్త సంస్థ ఏర్పాటుకు అమెరికాకు చెందిన సాన్మినా కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌బీవీఎల్‌ల మధ్య ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. ప్రతిపాదిత సంయుక్త సంస్థ విలువ సుమారు రూ.3,300 కోట్ల వరకు ఉండొచ్చు. ఇందులో రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌బీవీఎల్‌)కు 50.1 శాతం, సాన్మినాకు 49.9 శాతం వాటా ఉండనుంది. భారత్‌లోని సాన్మినాకు చెందిన సంస్థ షేర్లలో రూ.1,670 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వాటాను ఆర్‌ఎస్‌బీవీఎల్‌ పొందనుంది. ఆర్‌ఎస్‌బీవీఎల్‌ పెట్టుబడి అనంతరం ఆ సంస్థ సంయుక్త సంస్థగా మారుతుంది. ఆర్‌ఎస్‌బీవీఎల్‌, సాన్మినా కార్పొరేషన్‌లు ఇంతకుముందు ప్రకటించిన సంయుక్త సంస్థ ఏర్పాటు ఒప్పందాన్ని పూర్తి చేసినట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలియజేశాయి. 2022 మార్చితో ముగిసిన సంవత్సరంలో ఆర్‌ఎస్‌బీవీఎల్‌ ఆదాయం రూ.1,478.10 కోట్లు కాగా.. నికర లాభం రూ.179.80 కోట్లు. అలాగే మొత్తంగా రూ.10,857.70 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. ప్రతిపాదిత సంయుక్త         సంస్థ.. దేశంలోనే ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్‌ తయారీ కేంద్రాన్ని సృష్టిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. సాన్మినాకు ఉన్న 40 ఏళ్ల అధునాతన తయారీ అనుభవం, భారత వ్యాపార వ్యవస్థలో రిలయన్స్‌కు ఉన్న ప్రావీణ్యం, నాయకత్వ అనుభవం సంయుక్త సంస్థకు ఉపయోగపడతాయని పేర్కొంది. సంయుక్త సంస్థ రోజువారీ వ్యాపార నిర్వహణను చెన్నైలో సాన్మినాకు చెందిన యాజమాన్య బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. చెన్నైలో సాన్మినాకు 100 ఎకరాల ప్రాంగణంలో సంయుక్త సంస్థ తయారీ కార్యకలాపాలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని