Twitter Deal: ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ సిద్ధం!

ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ మళ్లీ సిద్ధమయ్యారు. ట్విటర్‌, మస్క్‌ మధ్య వివాదం తలెత్తడంతో ఈ లావాదేవీ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Updated : 05 Oct 2022 06:59 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ మళ్లీ సిద్ధమయ్యారు. ట్విటర్‌, మస్క్‌ మధ్య వివాదం తలెత్తడంతో ఈ లావాదేవీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున మస్క్‌ కొనుగోలు చేయడానికి ఆఫర్‌ చేసినట్లు ఆంగ్ల వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ట్విటర్‌ షేరు 13 శాతం దూసుకెళ్లి 47.95 డాలర్లకు చేరాయి. అనంతరం ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటాదార్లు సైతం ఈ లావాదేవీకి ఆమోదం తెలిపారు. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు మస్క్‌ జులైలో ప్రకటించారు. మస్క్‌ ఒప్పందం రద్దు చేసుకోవడంపై ట్విటర్‌ కోర్టును ఆశ్రయించగా.. అక్టోబరు 17న డెలావేర్‌ చాన్సెరీ కోర్టులో విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడడం గమనార్హం. కాగా, అటు ట్విటర్‌ కానీ, మస్క్‌ లాయర్లు కానీ ఈ వార్తలపై స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని