ఉపశమన లాభాలు అదిరాయ్‌

మార్కెట్లు ఒకరోజు ముందే లాభాల ‘పండగ’ చేసుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, లోహ, ఐటీ షేర్లకు కొనుగోళ్లు కుమ్మేశాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ ఒక్కరోజే 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

Published : 05 Oct 2022 02:43 IST

రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన సంపద

మార్కెట్లు ఒకరోజు ముందే లాభాల ‘పండగ’ చేసుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, లోహ, ఐటీ షేర్లకు కొనుగోళ్లు కుమ్మేశాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ ఒక్కరోజే 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా తయారీ పీఎంఐ తగ్గడంతో వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్‌ దూకుడు నెమ్మదించొచ్చన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు బలపడి 81.53 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.78 శాతం పెరిగి 89.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు కొనుగోళ్లతో కళకళలాడాయి.

* సూచీలు బలంగా పుంజుకోవడంతో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.66 లక్షల కోట్లు పెరిగి రూ.273.92 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో.. ఇంట్రాడేలో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 386.95 పాయింట్లు పెరిగి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,117.30- 17,287.30 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభాలు నమోదుచేశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 5.46% దూసుకెళ్లింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.43%, టీసీఎస్‌ 3.58%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.37%, హెచ్‌డీఎఫ్‌సీ 2.93%, టాటా స్టీల్‌ 2.90%, ఎల్‌ అండ్‌ టీ 2.87%, విప్రో 2.81%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.81%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.77% చొప్పున మెరిశాయి. అన్ని రంగాల వారీ సూచీలు దుమ్మురేపాయి. లోహ 3.43%, సేవలు 3.08%, ఫైనాన్స్‌ 2.82%, బ్యాంకింగ్‌ 2.74%, ఐటీ 2.68% రాణించాయి. బీఎస్‌ఈలో 2572 షేర్లు లాభాల్లో ముగియగా, 874 స్క్రిప్‌లు నష్టపోయాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

రూ.980 పెరిగిన పసిడి: బంగారం ధరలు పరుగులు తీశాయి. దిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.980 పెరిగి రూ.51,718 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం. కేజీ వెండి ధర రూ.3,790 లాభంతో రూ.61,997 దగ్గర స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి ధర 1710 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు వెండి 20.99 డాలర్ల వద్ద కదలాడుతోంది.

నేడు మార్కెట్లకు సెలవు
దసరా సందర్భంగా నేడు (బుధవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని