సంక్షిప్త వార్తలు (11)

కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తెలియజేసేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) వెల్లడించారు.

Published : 07 Oct 2022 02:05 IST

ఫ్యూచర్‌ రిటైల్‌ దివాలా ప్రక్రియ మొదలు

20 లోపు ఆసక్తి వ్యక్తీకరణకు అవకాశం

దిల్లీ: కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తెలియజేసేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) వెల్లడించారు. అర్హులైన ప్రాస్పెక్టివ్‌ రెజొల్యూషన్‌ అప్లికెంట్స్‌ (పీఆర్‌ఏ) తుది జాబితాను నవంబరు 6న ప్రకటిస్తారు. ఆ తర్వాత డిసెంబరు 6లోపు తమ పరిష్కార ప్రణాళికల్ని ఆయా పీఆర్‌ఏలు వెల్లడించాల్సి ఉంటుంది. రుణదాతల కమిటీ (సీఓసీ) సవరణలకు లోబడి ఈ దివాలా ప్రక్రియకు సంబంధించిన తేదీలు మారే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కనీసం రూ.100 కోట్ల ప్రత్యక్ష నికర విలువ, రూ.250 కోట్ల ఆస్తులు నిర్వహిస్తున్న /పెట్టుబడి పెట్టేందుకు నిధులు కలిగిన పీఆర్‌ఏలు మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసేందుకు అర్హులు. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు ప్రస్తుతం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 302 లీజ్‌డ్‌ రిటైల్‌ విక్రయశాలలున్నాయి. ఇందులో బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ వంటి పెద్ద స్టోర్లు 30 కాగా, 272 చిన్న స్థాయి విక్రయశాలలు ఉన్నాయి. 2020-21 వార్షిక నివేదిక ప్రకారం, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో 21,839 మంది ఉద్యోగులు దేశ వ్యాప్తంగా పని చేస్తున్నారు. అయితే 2022 ఆగస్టులో కార్పొరేట్‌ డెటార్‌ అందించిన సమాచారం ప్రకారం, ఉద్యోగుల సంఖ్యమ 2,242కు తగ్గిపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్, ముంబయి బెంచ్‌ జులై 20న ఎఫ్‌ఆర్‌ఎల్‌పై సీఐఆర్‌పీ ప్రారంభించాలని ఆదేశించింది. 180 రోజుల్లోపు దివాలా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్‌సీఎల్‌టీని ఆర్‌పీ మరింత సమయం కోరితే 90 రోజులు గడువు పొడిగించే అవకాశం ఉంది. లీగల్‌ ప్రొసీడింగ్స్‌తో కలిపినా తప్పనిసరిగా 330 రోజుల్లోపు దివాలా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.


6 నెలల కనిష్ఠానికి సేవల రంగ వృద్ధి: పీఎంఐ

దిల్లీ: సెప్టెంబరులో దేశీయ సేవల రంగ వృద్ధి 6 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పోటీ పరిస్థితుల ప్రభావంతో మార్చి నుంచి కొత్త ఆర్డర్ల రాక తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని పీఎంఐ నివేదిక వెల్లడించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ సూచీ సెప్టెంబరులో 54.3 పాయింట్లుగా ఉంది. ఆగస్టులో ఇది 57.2 పాయింట్లు. పీఎంఐ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే.. వృద్ధి ఉన్నట్లు, దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. సేవల రంగ పీఎంఐ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉన్నప్పటికీ.. ఆగస్టుతో పోలిస్తే వృద్ధి నెమ్మదించిందని నివేదిక పేర్కొంది.


విమానయాన సంస్థలకు అత్యవసర రుణం రూ.1500 కోట్లు!

పరిమితిని రూ.400 కోట్ల నుంచి పెంచిన ఆర్థిక శాఖ

దిల్లీ: అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద విమానయాన సంస్థలకు రుణ పరిమితిని రూ.400 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు ఆర్థిక శాఖ పెంచింది. కొవిడ్‌-19 పరిణామాల వల్ల ఇబ్బందులకు గురైన విమానయాన రంగానికి సాయం అందించేందుకే ఈ మార్పులు చేసింది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పౌర విమానయాన రంగం బలంగా, సమర్థంగా తయారవ్వడం ఎంతో ముఖ్యం. అందుకే ఈసీఎల్‌జీఎస్‌ పథకంలో విమానయాన సంస్థల రుణ అర్హత గరిష్ఠ పరిమితిని పెంచినట్లు’ ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. అయితే రుణం పొందేందుకు ఈ ఏడాది ఆగస్టు 30న వెలువరించిన ఈసీఎల్‌జీఎస్‌ మార్గదర్శకాల్లోని షరతులు, నిబంధనలు.. యథావిధిగానే వర్తిస్తాయని పేర్కొంది. ఈ పథకం కింద 7 శాతం వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. 2022, ఆగస్టు 5 వరకు ఈసీఎల్‌జీఎస్‌ పథకం కింద సుమారు రూ.3.67 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు.


ఆకాశ ఎయిర్‌ విమానాల్లో పెంపుడు జంతువులకూ అనుమతి

దిల్లీ: పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులను తమ విమానాల కేబిన్, చెక్‌ ఇన్‌ (కార్గో)లలో నవంబరు నుంచి అనుమతిస్తామని ఆకాశ ఎయిర్‌ తెలిపింది. అక్టోబరు 15న ప్రారంభమయ్యే బుకింగ్‌ల ద్వారా నవంబరు నుంచి పెంపుడు కుక్కలు, పిల్లులతో ప్రయాణించవచ్చని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ మార్కెటింగ్, ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌ బెల్సన్‌ కౌటిన్హో పేర్కొన్నారు.

* ప్రతి పెంపుడు జంతువును ఒక బోనులో ఉంచాలి. కేబిన్‌లో తీసుకెళ్లాలనుకుంటే బోను సహా జంతువు బరువు 7 కిలోల లోపు ఉండాలి. * చెక్‌-ఇన్‌లో అయితే 32 కిలోలు ఉండొచ్చు. ఇంతకన్నా అధిక బరువుండే వాటినీ తీసుకెళ్లొచ్చు. వాటికి విడిగా ఛార్జీలుంటాయి.* ప్రస్తుతం ఎయిరిండియా విమానాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం ఉంది.


రూపే క్రెడిట్‌ కార్డులపైనా ఛార్జీలుండవ్‌

దిల్లీ: యూపీఐ చెల్లింపుల్లో రూపే క్రెడిట్‌ కార్డుతో చేసే రూ.2,000 వరకు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొంది. ‘రూ.2,000, అంతకంటే తక్కువ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎమ్‌డీఆర్‌) సున్నా ఉంటుంద’ని ఎన్‌పీసీఐ ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది.


గ్లెన్‌మార్క్‌ నుంచి మధుమేహ వ్యాధి ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ ఫార్మా కంపెనీ అయిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్, ‘థయాజోలిడైనెడియోన్‌ లొబెగ్లిటజోన్‌’ అనే మధుమేహ వ్యాధి ఔషధాన్ని విడుదల చేసింది. టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ఇన్సులిన్‌ తీసుకుంటున్నప్పటికీ వ్యాధి అదుపులోకి రానివారికి ఇది అనువైనదిగా కంపెనీ పేర్కొంది. ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.10 ధర నిర్ణయించింది. ఈ మందు ఎంతో మంది బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ మాలిక్‌ వివరించారు.


భారత గేమింగ్‌ సంస్థ జూపీలో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు!

దిల్లీ: భారత ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థ జూపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని మైక్రోసాఫ్ట్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇరు సంస్థల మధ్య చర్చలు విజయవంతమైతే.. జూపీలోకి 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.800 కోట్లు) పెట్టుబడులను మైక్రోసాఫ్ట్‌ పెట్టొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆన్‌లైన్‌ క్లౌడ్‌ సేవల విభాగాన్ని విస్తరించుకునే ఉద్దేశంలో భాగంగానే మైక్రోసాఫ్ట్‌ ఈ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటోందని ఆ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపాయి. మరిన్ని భాషల్లోకి గేమ్‌లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్‌తోనూ జూపీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరిన్ని ఉత్పత్తుల అభివృద్ధికి, వినియోగదారుల అనుభూతిని పెంచేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ఆ సమయంలో కంపెనీ వెల్లడించింది.


మాంద్యం అవకాశాలు పెరుగుతున్నాయ్‌

ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) మరో సారి తగ్గించింది. పరిస్థితులు చక్కబడే ముందు మరింత అధ్వానంగా మారొచ్చని ఐఎమ్‌ఎఫ్‌ ఎండీ క్రిస్టీనా జార్జివా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు మారుతూ వచ్చాయి. చాలా వరకు దేశాలపై ఈ యుద్ధం ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణం. ఇప్పటికే అంతర్జాతీయ వృద్ధి అంచనాలను మూడు సార్లు సవరించామని.. తాజాగా 2022కు 3.2%; 2023కు 2.9 శాతం వృద్ధి లభిస్తుందని అంచనా వేసినట్లు క్రిస్టీనా తెలిపారు. ‘మాంద్యం వచ్చేందుకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి.. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రపంచంలో మూడింట ఒక వంతు దేశాల్లో వరుస త్రైమాసికాల్లో జీడీపీ తగ్గొచ్చ’ని అంచనా వేశారు.

లేమాన్‌ బ్రదర్స్‌ను గుర్తు చేస్తున్న క్రెడిట్‌ సూయిజ్‌: స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌ అయిన క్రెడిట్‌ సూయిజ్‌ గ్రూప్‌ ఏజీ పతనం దిశగా వెళుతోందన్న వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యాంకు షేర్లు రికార్డు కనిష్ఠాలకు చేరాయి. ఉద్యోగులు ప్రశాంతంగా ఉండాలని బ్యాంకు సీఈఓ ఉల్రిచ్‌ కాయినర్‌ సూచించారు. మూలధన స్థాయిలు, ద్రవ్యలభ్యతలు బాగానే ఉన్నాయని చెబుతూనే బ్యాంకు ‘సంక్లిష్ట పరిస్థితుల్లో’ ఉందని అంగీకరించారు. ఏడాది కిందట క్రెడిట్‌ సూయిజ్‌ మార్కెట్‌ విలువ 22.3 బి. డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 10.4 బి. డాలర్లకు క్షీణించింది. అంటే 56.2 శాతం తగ్గింది. క్రెడిట్‌ సూయిజ్‌ విలువ క్షీణత నేపథ్యంలో అంతర్జాతీయ మాంద్యానికి కారణమైన లేమాన్‌ సంక్షోభాన్ని మార్కెట్‌ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.


అపోలో హాస్పిటల్స్‌ చేతికి ఆయుర్‌వేద్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంప్రదాయ ఆయుర్వేద వైద్య సేవలు అందించే సంస్థ ఆయుర్‌వేద్‌లో 60 శాతం వాటాను రూ.26.4 కోట్లకు కొనుగోలు చేసినట్లు అపోలో హాస్పిటల్స్‌ వెల్లడించింది. ఆయుర్‌వేద్‌ హాస్పిటల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. దీన్ని వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లకు పెంచుకునేందుకు వైద్య సదుపాయాలను, సేవలను విస్తరించనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ వెల్లడించింది. సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి, అల్లోపతి వైద్యాన్ని జోడించడం ద్వారా జబ్బులను కచ్చితంగా నయం చేసే ప్రక్రియలను ఆవిష్కరించడానికి కృషి చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి పేర్కొన్నారు.


లాభం 2% వరకు తగ్గొచ్చు: డాబర్‌

దిల్లీ: జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కమొడిటీ ధరలు అధికమై, ద్రవ్యోల్బణం పెరగడంతో కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 2 శాతం వరకు తగ్గొచ్చని ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ డాబర్‌ ఇండియా అంచనా వేసింది. ఇదే సమయంలో ఆదాయం మాత్రం 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అంతర్జాతీయ వ్యాపారం రెండంకెల వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని వెల్లడించింది. పెరిగిన ద్రవ్యోల్బణ ప్రభావంతో జులై-సెప్టెంబరు నిర్వహణ లాభంపై 150-200 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడిందని పేర్కొంది. ప్రస్తుతం కమొడిటీ ధరలు అదుపులోకి వస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో మార్జిన్లు మెరుగుపడతాయని అంచనా వేసింది. జులైలో ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉండగా, ఆగస్టులో అది 7 శాతానికి చేరింది. పట్టణాల్లో ఆధునిక వాణిజ్యం, ఇ-కామర్స్‌ వల్ల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదు కాగా, గ్రామీణ విపణిలో నగదు లభ్యత తగ్గడంతో కొంత ఒత్తిడి కనిపించిందని డాబర్‌ ఇండియా వివరించింది.


గూగుల్‌ క్లౌడ్‌పై 18,000 మంది వృత్తి నిపుణులకు శిక్షణ

హెచ్‌సీఎల్‌ టెక్‌

దిల్లీ: సాంకేతిక, కన్సల్టింగ్‌ వృత్తి నిపుణులు 18,000 మందికి గూగుల్‌ క్లౌడ్‌పై శిక్షణను ఇచ్చే యోచనలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉంది. తద్వారా గూగుల్‌ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉత్పత్తులు, సొల్యూషన్లతో ప్రపంచవ్యాప్తంగా డిజిటలీకరణను వేగవంతం చేసే సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు పేర్కొంది. గూగుల్‌ క్లౌడ్‌కు హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. 2019లో ప్రత్యేక గూగుల్‌ క్లౌడ్‌ ఎకోసిస్టమ్‌ యూనిట్‌ను సంస్థ ఏర్పాటు చేసింది. క్లౌడ్‌ సేవలు అవసరమైన కంపెనీలు గూగుల్‌ క్లౌడ్‌కు మారేందుకు ఇరు సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్యం దోహదం చేయనుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ, ఎండీ సి.విజయకుమార్‌ తెలిపారు. ‘డిజిటల్‌ ఆధారిత వ్యాపార విధానాలను అభివృద్ధి చేసేందుకు క్లౌడ్‌ సాంకేతికతపై చాలా సంస్థలు పెద్దమొత్తంలో వెచ్చిస్తున్నాయి. మా క్లయింట్లకు ఈ విషయంలో సహకారం అందించేందుకు గూగుల్‌ క్లౌడ్‌తో మేం కుదుర్చుకున్న భాగస్వామ్యం దోహదం చేస్తోంది. మున్ముందు మరింత వేగంగా సొల్యూషన్లను అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని అనుకుంటున్నామ’ని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని