హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ‘స్మార్ట్‌హబ్‌ వ్యాపార్‌’

వ్యాపార వర్గాలకు చెల్లింపులు, బ్యాంకింగ్‌ సేవలను మరింత దగ్గర చేసే లక్ష్యంతో ‘స్మార్ట్‌హబ్‌ వ్యాపార్‌’ అనే మొబైల్‌ యాప్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కరెంటు ఖాతా ఉన్న వ్యాపారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే పలు రకాల బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Published : 07 Oct 2022 02:17 IST

వ్యాపారుల రోజువారీ లావాదేవీల నిర్వహణకు అనుకూలం

తెలుగు రాష్ట్రాల్లో మరో 179 బ్యాంకు శాఖలు

5,000 మంది ఉద్యోగుల ఎంపికకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార వర్గాలకు చెల్లింపులు, బ్యాంకింగ్‌ సేవలను మరింత దగ్గర చేసే లక్ష్యంతో ‘స్మార్ట్‌హబ్‌ వ్యాపార్‌’ అనే మొబైల్‌ యాప్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కరెంటు ఖాతా ఉన్న వ్యాపారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే పలు రకాల బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. కార్డులు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్, రిమోట్‌ చెల్లింపులు - ఇలా ఎటువంటి పద్ధతిలో అయినా చెల్లింపులు స్వీకరించే అవకాశం కలుగుతుంది. యూపీఐ ద్వారా నిర్వహించే చెల్లింపులు వెనువెంటనే వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. అదే సమయంలో తమ పంపిణీదార్లు, ఏజెంట్లకు చెల్లింపులను యాప్‌ ద్వారా చేయొచ్చు. పలు రకాల బిల్లులు, జీఎస్‌టీ చెల్లింపులు సైతం పూర్తిచేయవచ్చు. ఏరోజుకారోజు వసూళ్లు, చెల్లింపులను పోల్చి చూసుకోవచ్చు. దీనివల్ల వ్యాపారులకు పనిభారం తగ్గి, తమ రోజువారీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడానికి మరింత సమయం ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ తరుణ్‌ చౌధ్రీ, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ టీవీఎస్‌ రావు వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మంది ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి దాదాపు 75 లక్షల మంది దీన్ని వినియోగిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తరుణ్‌ చౌధ్రీ వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో 314, ఆంధ్రప్రదేశ్‌లో 274 శాఖలున్నాయి. కొత్తగా తెలంగాణలో 90 శాఖలు, ఆంధ్రప్రదేశ్‌లో 89 శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 5,000 మంది ఉద్యోగులను కూడా నియమిస్తామని తెలిపారు. వడ్డీరేట్లు పెరిగినా రుణాలకు గిరాకీ తగ్గలేదని చెప్పారు. ప్రస్తుత పండుగల సీజన్లో వాహనాల కొనుగోలుకు, ఇతర అవసరాలకు రిటైల్‌ రుణాలు అధికంగా జారీ చేస్తున్నట్లు వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జోనల్‌ అధికారి రవి దాడి, ఇతర ఉన్నతాధికార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని