అమ్ముడవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షలు

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో విక్రయమవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షల వరకు ఉంటాయని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ ప్రాప్‌టైగర్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత అమ్మకాల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఇళ్లను అమ్మేందుకు స్థిరాస్తి సంస్థలకు సగటున 32 నెలల సమయం పడుతుందని తెలిపింది.

Published : 07 Oct 2022 02:17 IST

32 నెలలు పట్టొచ్చు

8 ప్రధాన నగరాలపై ప్రాప్‌టైగర్‌ నివేదిక

దిల్లీ: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో విక్రయమవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షల వరకు ఉంటాయని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ ప్రాప్‌టైగర్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత అమ్మకాల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఇళ్లను అమ్మేందుకు స్థిరాస్తి సంస్థలకు సగటున 32 నెలల సమయం పడుతుందని తెలిపింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో అయితే 62 నెలల సమయం అవసరమని పేర్కొంది. ఆమ్రపాలి, జేపీ ఇన్‌ఫ్రాటెక్, యునిటెక్‌ లాంటి స్థిరాస్తి సంస్థలు కొనుగోలుదార్లకు ఇళ్ల అప్పగింతలో విఫలమవ్వడం.. దిల్లీ-ఎన్‌సీఆర్‌ స్థిరాస్తి విపణిపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ప్రాప్‌ టైగర్‌ సంస్థ 8 నగరాలు- అహ్మదాబాద్, దిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతం, పుణెల్లోని స్థిరాస్తి విపణిపై అధ్యయనం చేస్తుంటుంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..

* సెప్టెంబరు 30 నాటికి విక్రయమవ్వని ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య 7,85,260కు పెరిగింది. జూన్‌ చివరికి ఈ సంఖ్య 7,63,650గా ఉంది.

* ఈ ఏడాది జులై-సెప్టెంబరులో పై 8 నగరాల్లో గృహ విక్రయాలు 49 శాతం పెరిగి 83,220కు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 55,910గా ఉంది.

* గృహాలకు గిరాకీ పుంజుకోవడంతో.. ఇళ్ల నిల్వలను విక్రయించేందుకు పట్టే సమయం తగ్గింది. 2021 మూడో త్రైమాసికంలో ఈ సమయం సగటున 44 నెలలుగా ఉండగా.. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో 32 నెలలకు దిగివచ్చింది. కొవిడ్‌-19 రెండో దశ తర్వాత విక్రయాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.

* నిల్వల విక్రయాన్ని పూర్తి చేసేందుకు పట్టే సమయం కోల్‌కతాలో అత్యంత తక్కువగా 24 నెలలుగా ఉంది.

* ఎనిమిది నగరాల్లో విక్రయం కాని ఇళ్లలో సుమారు 21 శాతం వరకు రెడీ-టు-మూవ్‌ విభాగంలో ఉన్నాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని