సంక్షిప్త వార్తలు (6)

ఓ మోస్తరుగా అంచనా వేయదగిన స్థితి నుంచి తీవ్ర అనిశ్చితి దశకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటోందని ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జివా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు వాటా కలిగిన దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో వరుసగా 2 త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధిని నమోదు చేయొచ్చని పేర్కొన్నారు.

Updated : 08 Oct 2022 06:42 IST

2026కు 4 లక్షల కోట్ల డాలర్ల నష్టం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ అంచనా

వాషింగ్టన్‌: ఓ మోస్తరుగా అంచనా వేయదగిన స్థితి నుంచి తీవ్ర అనిశ్చితి దశకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటోందని ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జివా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు వాటా కలిగిన దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో వరుసగా 2 త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధిని నమోదు చేయొచ్చని పేర్కొన్నారు.

ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశానికి ముందు ఆమె కీలక ప్రసంగం చేశారు. ‘మేం ఇప్పటికే ప్రపంచ వృద్ధి అంచనాలను మూడు సార్లు తగ్గించాం. 2022కు 3.2%, 2023కు 2.9 శాతం వృద్ధి లభిస్తుందని తాజాగా అంచనా వేశాం. వచ్చే వారంలో విడుదల చేయనున్న నివేదికలో 2023 వృద్ధి అంచనాలను మరింత తగ్గించే అవకాశం ఉంద’ని ఆమె పేర్కొన్నారు. ‘మాంద్యం ముప్పు మరింత పెరుగుతోంది. ఒకవేళ వృద్ధి సానుకూలంగా ఉన్నా.. వాస్తవ ఆదాయాలు క్షీణించడం, ధరలు పెరగడం వల్ల మాంద్యాన్ని తలపించవచ్చ’ని జార్జివా పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటి నుంచి 2026 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గొచ్చని తెలిపారు. ఇది జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానమని చెప్పారు. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గట్టి కుదుపే అని అన్నారు. కొవిడ్‌-19 పరిణామాలకు తోడు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం  వల్ల అనిశ్చితి బాగా పెరిగిందని తెలిపారు. మున్ముందు మరిన్ని కుదుపులు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


పానేషియా బయోటెక్‌ ఛైర్మన్‌ మృతి

దిల్లీ: పానేషియా బయోటెక్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ సోషిల్‌ కుమార్‌ జైన్‌ (89) శుక్రవారం మరణించారు. పది రోజుల నుంచి మేదాంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జైన్‌, శుక్రవారం మధ్యాహ్నం కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల మరణించారని సంస్థ తెలిపింది. జైన్‌ మృతిపై కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు సంతాపం తెలియచేశారు. 1984లో పానేషియా డ్రగ్స్‌ లిమిటెడ్‌ను జైన్‌ స్థాపించారు. 1995 సెప్టెంబరులో స్టాక్‌మార్కెట్లలో నమోదు చేసినప్పుడు సంస్థ పేరును పానేషియా బయోటెక్‌ లిమిటెడ్‌గా మార్చారు. వ్యాక్సిన్‌ తయారీ ప్రధాన సంస్థల్లో ఈ కంపెనీ కూడా ఒకటి.


ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు బిడ్‌ల ఆహ్వానం

60.72% వాటా విక్రయించనున్న ప్రభుత్వం, ఎల్‌ఐసీ

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ బ్యాంకులో తమకు ఉన్న 94.72 శాతం వాటాలో 60.72 శాతం వాటాను విక్రయిస్తామని ప్రభుత్వం, ఎల్‌ఐసీ ప్రకటించాయి. ఈ వాటా కొనుగోలుకు ఆసక్తి గల మదుపర్లు డిసెంబరు 16లోపు బిడ్లు దాఖలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం (529.41 కోట్ల షేర్లు), ప్రభుత్వానికి 45.48 శాతం (488.99 కోట్ల షేర్లు) వాటాలున్నాయి. ఇందులో ప్రభుత్వం 30.48%, ఎల్‌ఐసీ 30.24 శాతం వాటాలను విక్రయించనున్నాయి. మొత్తంగా 60.72 శాతం వాటా విక్రయంతో పాటు ఐడీబీఐ బ్యాంక్‌ యాజమాన్య నియంత్రణను కూడా ప్రభుత్వం బదిలీ చేయనుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం పేర్కొంది.

బిడ్‌ దాఖలు చేయాలంటే..

కనీసం రూ.22,500 కోట్ల నికర సంపద కలిగిన ఇన్వెస్టర్లే బిడ్లు దాఖలు చేయాలి. గత అయిదు ఆర్థిక సంవత్సరాలలో మూడేళ్లు నికర లాభాన్ని నమోదు చేయాలి. కన్సార్షియంగా (బృందం) బిడ్‌ వేయాలంటే.. అందులో గరిష్ఠంగా నలుగురు సభ్యులు ఉండాలి. విజయవంత బిడ్డర్‌ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు కనీసం 40 శాతం మూలధనాన్ని తప్పనిసరిగా లాక్‌- ఇన్‌ చేయాల్సి ఉంటుంది. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల ఎంపిక, ఐడీబీఐ బ్యాంక్‌లో ఎంత మేర వాటా కలిగి ఉండాలి.. తదితర వాటిని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయిస్తుంది. ఆర్‌బీఐ నిర్వహించే ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ మదింపు ప్రక్రియను కూడా బిడ్డర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.


ప్రవాసుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్‌వైర్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇక్కడి బంధుమిత్రులకు ఆన్‌లైన్లో సులువుగా నగదు బదిలీ  కోసం ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్‌వైర్‌’ సదుపాయాన్ని ఆవిష్కరించింది. దీనివల్ల స్విఫ్ట్‌ ఆధారిత రెమిటెన్స్‌ సేవలను ఎంతో వేగంగా, సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. ఈ విధానంలో ‘వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌’తో నగదు బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి. ఆన్‌లైన్లోనే డిక్లరేషన్‌, ఇతర పత్రాలు సమర్పించాలి. మారకపు రేటును ముందుగానే నిర్ణయించుకుని, తదుపరి నగదు బదిలీ పూర్తిచేయొచ్చు. నగదు బదిలీ చేసిన వినియోగదారుడికి, ఆ లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలతో వెంటనే ఇ-మెయిల్‌ వస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు.


యాంఫీ ఛైర్మన్‌గా బాలసుబ్రమణియన్‌

దిల్లీ: మ్యూచువల్‌ఫండ్‌ సంస్థల సంఘం యాంఫీ ఛైర్మన్‌గా ఆదిత్యబిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టరు ఎ.బాలసుబ్రమణియన్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఎడెల్‌వైజ్‌ ఏఎంసీ ఎండీ రాధికా గుప్తా యాంఫీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబరులో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశం జరిగేవరకు వీరిద్దరూ బాధ్యతల్లో ఉంటారని సంస్థ పేర్కొంది. యాంఫీ ఫైనాన్షియల్‌ లిటరసీ కమిటీ ఎక్స్‌ అఫిషియో ఛైర్మన్‌గా కూడా బాలసుబ్రమణియన్‌ వ్యవహరిస్తారు. కార్యకలాపాల కమిటీ చీఫ్‌గా గుప్తా ఉంటారు. నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ సందీప్‌ సిక్కాను ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.


అమెరికాలో నియామకాలు మెరుగ్గానే

ఫెడ్‌ కీలక రేట్లు మరింత పెంచే అవకాశం

వాషింగ్టన్‌: ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో అమెరికాలో నియామకాలు తగ్గాయి. అయితే 2,63,000 మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. సంఖ్యాపరంగా నియామకాలు ఎక్కువగానే ఉండటం వల్ల.. ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని కొనసాగించేందుకు మున్ముందు కూడా అమెరికా కేంద్రబ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్లను మరింత పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో 3,15,000 నియామకాలు జరిగితే, ఈ సంఖ్య సెప్టెంబరులో 2.63 లక్షలుగా ఉంది. 2021 ఏప్రిల్‌ తర్వాత నెలవారీ వృద్ధిపరంగా ఇవి తక్కువే. అయితే నిరుద్యోగిత రేటు 3.7 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. ఇది అర్ధ శతాబ్దపు కనిష్ఠ స్థాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని