అదానీ కుటుంబం నుంచి రూ.20000 కోట్లు సమీకరించే ప్రతిపాదనను వ్యతిరేకించండి

అదానీ కుటుంబానికి వారెంట్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయాలని అంబుజా సిమెంట్స్‌ వాటాదార్లకు సంస్థాగత మదుపర్ల సలహా సంస్థ ఐఐఏఎస్‌ సూచించింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అమిత్‌ దేశాయ్‌, పుర్వి సేథ్‌ నియామక ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది.

Published : 08 Oct 2022 02:27 IST

అంబుజా వాటాదార్లకు ఐఐఏఎస్‌ సూచన

దిల్లీ: అదానీ కుటుంబానికి వారెంట్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయాలని అంబుజా సిమెంట్స్‌ వాటాదార్లకు సంస్థాగత మదుపర్ల సలహా సంస్థ ఐఐఏఎస్‌ సూచించింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అమిత్‌ దేశాయ్‌, పుర్వి సేథ్‌ నియామక ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. అంబుజా సిమెంట్స్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నేడు (ఈనెల 8న) జరగనుంది. ఇందులో 12 తీర్మానాలపై వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. అదానీ గ్రూపునకు చెందిన హార్మోనియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 47.74 కోట్ల షేర్లను రూ.418.87 ధరకు కేటాయించడం ఇందులో ఒకటి. వీటిని ఒకటి లేదా పలు దఫాల్లో జారీ చేయడం ద్వారా రూ.20,001 కోట్లను కంపెనీ సమీకరించనుంది. బోర్డులో అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుమారుడు కరణ్‌ అదానీ, మరో ఇద్దరు డైరెక్టర్లు, నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించే ప్రతిపాదనపైనా అనుమతి కోరనుంది. ‘వారెంట్ల మార్పిడితో మూలధన స్థాయి 19.4 శాతం మేర తగ్గేందుకు దారి తీయొచ్చు. ప్రమోటరు వాటా పరిమితి 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగొచ్చు. ఇష్యూ ధర కూడా ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.500.20 కంటే 17.3 శాతం తక్కువ. హోల్సిమ్‌ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ఎక్కువ. పైగా అంబుజా సిమెంట్స్‌కు స్టాండలోన్‌ పద్ధతిలో రూ.3,840 కోట్లు, ఏకీకృతంగా రూ.8,500 కోట్ల నగదు, నగదు సమాన నిల్వలు ఉన్నాయ’ని ఐఐఏఎస్‌ తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా ప్రమోటర్లకు వారెంట్ల జారీ ప్రతిపాదనకు అనుకూలంగా లేమని, అందువల్ల వ్యతిరేకంగా ఓటేయాలని వాటాదార్లకు సూచించింది.


అదానీ రూ.65,000 కోట్ల పెట్టుబడులు

5-7 ఏళ్లలో మెగా సోలార్‌ ప్లాంటు ఏర్పాటు

జయపుర: రాజస్థాన్‌లో రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000కు పైగా ఉద్యోగాలు కలుగుతాయని ఆయన తెలిపారు. వచ్చే 5-7 ఏళ్లలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయడంతో పాటు, సిమెంటు ప్లాంటు విస్తరణ, జయపుర విమానాశ్రయ నవీకరణను ఈ నిధులతో చేపడతామని శుక్రవారమిక్కడ జరిగిన ‘ఇన్వెస్ట్‌ రాజస్థాన్‌ 2022 సమిట్‌’లో అదానీ వెల్లడించారు. వారం కిందటే ప్రపంచంలోనే అతిపెద్ద పవన-సౌర హైబ్రిడ్‌ విద్యుత్‌ ప్లాంటు వాణిజ్య కార్యకలాపాలను రాజస్థాన్‌లో తమ గ్రూప్‌ ప్రారంభించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సిమెంటు తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం కోసం రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. రెండు వైద్య కళాశాలలు, ఒక క్రికెట్‌ స్టేడియం కూడా నిర్మిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని