సూచీలకు అతి స్వల్ప నష్టాలు

సూచీల రెండు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది.

Published : 08 Oct 2022 02:31 IST

ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ

సమీక్ష

సూచీల రెండు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున ముడిచమురు ఉత్పత్తి తగ్గిస్తామంటూ, ఓపెక్‌ ప్లస్‌ దేశాలు ప్రకటించడంతో చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ కొత్త జీవన కాల కనిష్ఠానికి పడిపోవడమూ ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 13 పైసలు తగ్గి 82.30 వద్ద ముగిసింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 3.64% పెరిగి 97.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ముగియగా.. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

ఒడుదొడుకుల్లో...: ఉదయం సెన్సెక్స్‌ 58,092.56 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా, తిరిగి నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 57,851.15 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అక్కడ నుంచి సూచీ మళ్లీ పుంజుకుని 58,269.34 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 30.81 పాయింట్ల నష్టంతో 58,191.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 17.15 పాయింట్లు కోల్పోయి 17,314.65 వద్ద స్థిరపడింది.

14 పైకి.. 16 కిందకు: సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 రాణించగా.. 16 డీలాపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు 1.37%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.3%, ఎస్‌బీఐ 1.28%, టీసీఎస్‌ 1.28%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.79%, ఐటీసీ 0.77%, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 0.73% షేర్లు కూడా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. టైటన్‌ 5.27%, పవర్‌ గ్రిడ్‌ 1.45%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.06%, ఎన్‌టీపీసీ 0.95%, మారుతీ సుజుకీ 0.93%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.66%, ఎల్‌ అండ్‌ టీ 0.57%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.49% షేర్లు రాణించాయి.

* రంగాల సూచీల విషయానికొస్తే.. చమురు-గ్యాస్‌ 0.78%, విద్యుత్‌ 0.72%, లోహ 0.63%, ఐటీ 0.57%, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.52 శాతం మేర క్షీణించాయి. వినియోగ వస్తువుల రంగాల సూచీ 2.13 శాతం పెరగగా. టెలికమ్యూనికేషన్స్‌, పరిశ్రమలు, భారీ యంత్రపరికరాల సూచీలూ రాణించాయి.

* సెప్టెంబరు త్రైమాసికంలో టైటన్‌ అమ్మకాలు 18 శాతం పెరగడంతో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 5.27 శాతం పెరిగి రూ.2,730.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలో అత్యధికంగా పెరిగిన షేరు ఇదే.

* సుజ్లాన్‌ ఎనర్జీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా వినోద్‌ ఆర్‌ తంతిని నియమించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీగా ఉన్న తుల్సి తంతి ఈనెల 1న మరణించిన సంగతి విదితమే.

ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీఓకు 71.93 రెట్ల స్పందన

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరిట విక్రయశాలలు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ముగిసేసరికి 71.93 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను జారీ చేయనుండగా.. 449.53 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయని ఎన్‌ఎస్‌ఈ వద్ద లభ్యమవుతున్న గణాంకాలు చెబుతున్నాయి. అర్హులైన సంస్థాగత మదుపర్ల విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 63.59 రెట్లు, చిన్న మదుపర్ల విభాగంలో 19.71 రెట్ల స్పందన లభించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్లు సమీకరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని