సిమెంటు రంగంలో స్థిరీకరణ!

దేశీయ సిమెంటు రంగం స్థిరీకరణ దిశగా సాగుతోంది. చిన్న కంపెనీల యూనిట్లను పెద్ద సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 2030 నాటికి దేశంలో సిమెంటు అగ్రగామి సంస్థగా అవతరించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తే..

Updated : 11 Oct 2022 06:55 IST

చిన్న యూనిట్ల కొనుగోలులో జేఎస్‌డబ్ల్యూ, అదానీ
అల్ట్రాటెక్‌తో పాటు 3 సంస్థలదే అజమాయిషీ

దేశీయ సిమెంటు రంగం స్థిరీకరణ దిశగా సాగుతోంది. చిన్న కంపెనీల యూనిట్లను పెద్ద సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 2030 నాటికి దేశంలో సిమెంటు అగ్రగామి సంస్థగా అవతరించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తే.. ప్రస్తుత అగ్రగామి సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కూడా తన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే యత్నాల్లో ఉంది. జేఎస్‌డబ్ల్యూ కూడా కొనుగోళ్ల బాటలోనే ఉంది.

అదానీ: ఇప్పటికే హోల్సిమ్‌ గ్రూప్‌ ఆధీనంలోని అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలను కొనుగోలు చేయడం ద్వారా 70 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో, దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్‌ సంస్థగా అదానీ గ్రూప్‌ మారింది. 2030 నాటికి సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మి.టన్నులకు పెంచుకునే యత్నాల్లో సంస్థ ఉంది. ఇందులో భాగంగానే జేపీ గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌ వ్యాపారాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేపీ గ్రూప్‌ నుంచి అల్ట్రాటెక్‌ కొనుగోలు చేయగా, మిగిలిన యూనిట్లను అదానీ గ్రూప్‌ స్వాధీనం చేసుకునే యత్నాల్లో ఉందని చెబుతున్నారు. జేపీ గ్రూప్‌నకు చెందిన జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ (జేఏఎల్‌), జేపీవీఎల్‌ (జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌)కు కలిపి 10.55 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సిమెంటు ప్లాంట్లు, 339 మెగావాట్ల క్యాప్టివ్‌ విద్యుదుత్పత్తి ప్లాంటు ఉన్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షాబాద్‌ సిమెంటు ప్లాంటు సామర్థ్యాన్ని 1.20 మి.ట. మేర పెంచే ప్రణాళికను ఆ సంస్థ ప్రస్తుతానికి నిలిపేసింది. ఈ సిమెంటు వ్యాపారాల్ని విక్రయిస్తామని జేపీగ్రూప్‌ సంస్థలు సోమవారం ప్రకటించాయి. జేఎఎల్‌పై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దివాలా ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో, రుణభారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. జేపీ గ్రూప్‌ కంపెనీలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ,ఆంధ్రాసిమెంట్‌ దివాలా స్మృతిని ఎదుర్కొంటున్నాయి.

రూ.5,000 కోట్లతో: మధ్యప్రదేశ్‌లో జేపీ గ్రూప్‌నకు చెందిన నిగ్రీ సిమెంట్‌ యూనిట్‌ ఏడాదికి 4 మి.టన్నుల సామర్థ్యంతో నిర్మించినా, ప్రస్తుతం 2 మి.ట. మేర కార్యకలాపాలు సాగిస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ యూనిట్‌ను విక్రయించాలని నిర్ణయించినట్లు జేపీ గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఎవరు కొనుగోలు చేస్తున్నారనేది మరో వారంలో తెలియవచ్చు. ఈ కంపెనీ కోసం అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారు వెల్లడించారు. సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌తో పాటు ఇతర ప్రధానేతర ఆస్తుల కొనుగోలుకు అదానీ గ్రూప్‌ రూ.5,000 కోట్లు వెచ్చించనుందని సమాచారం.

* ఈ వార్తల నేపథ్యంలో.. జైప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ షేరు బీఎస్‌ఈలో 3.8 శాతం పెరిగి రూ.8.46 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.66 శాతం పెరిగి రూ.8.53 స్థాయిని తాకింది.

* జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ షేరు బీఎస్‌ఈలో 9.72 శాతం పెరిగి రూ.11.74 వద్ద ముగిసింది. ఒక దశలో 12.52 శాతం లాభంతో రూ.12.04 స్థాయిని కూడా తాకింది.

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌: ఇండియా సిమెంట్స్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ (3 మిలియన్‌ టన్నులు), రాజస్థాన్‌ యూనిట్లను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికోసం అల్ట్రాటెక్‌ ఇచ్చిన ఆఫర్‌ కంటే మెరుగైన ప్యాకేజీతో జేఎస్‌డబ్ల్యూ ముందుకొచ్చినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అంబుజా సిమెంట్స్‌ కొనుగోలులో విఫలమైన సంస్థ, ఇండియా సిమెంట్స్‌ యూనిట్లను మాత్రం స్వాధీనం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఇండియా సిమెంట్స్‌ నికర రుణాలు రూ.3,039 కోట్లుగా ఉన్నాయి. వీటిని తగ్గించుకునేందుకు కంపెనీ భూములతో పాటు యూనిట్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత మేలో ప్రకటించడం గమనార్హం.


ఎస్‌ఎంపీఎల్‌లో వాటా జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు: ఇండియా సిమెంట్స్‌

మ స్ప్రింగ్‌వే మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంపీఎల్‌)లో పూర్తి వాటాను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు రూ.476.87 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఇండియా సిమెంట్స్‌ సోమవారం వెల్లడించింది. సిమెంట్‌ తయారీలో వినియోగించే సున్నపురాయి కలిగిన భూమితో (పన్నా జిల్లా) పాటు మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సిమెంట్‌ ప్లాంట్‌ను ఎస్‌ఎంపీఎల్‌ కలిగి ఉంది. ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ లావాదేవీ పూర్తి కానుంది. మొత్తం ప్రతిపాదిత విలువ రూ.476.87 కోట్లలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ సోమవారం రూ.373.87 కోట్లు ఇండియా సిమెంట్స్‌కు చెల్లించింది. డిసెంబరు 31లోపు మిగతా రూ.103 కోట్లు చెల్లించనుంది. దక్షిణాదికి చెందిన ఇండియా సిమెంట్స్‌ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15.5 మి.టన్నులుగా ఉంది.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌: వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 120 మిలియన్‌ టన్నుల నుంచి 160 మి.ట.కు పెంచాలనుకుంటోంది. జేపీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపారంలో కొంతభాగాన్ని  గతంలోనే అల్ట్రాటెక్‌ కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని