Moonlighting: ఉద్యోగుల జీవితాలను నాశనం చేయబోం: టీసీఎస్‌ సీఓఓ

మూన్‌లైటింగ్‌ (ఒకటికి మించి ఉద్యోగాలు చేసే) ఉద్యోగులపై చర్యలు చేపట్టడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగ జీవితం నాశనం అవుతుందని, అందువల్ల వారి పట్ల కొంత దయ చూపించడమూ ముఖ్యమని టీసీఎస్‌ ముఖ్య కార్యకలాపాల అధికారి(సీఓఓ) ఎన్‌.గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు.

Updated : 18 Oct 2022 09:11 IST

ముంబయి: మూన్‌లైటింగ్‌ (ఒకటికి మించి ఉద్యోగాలు చేసే) ఉద్యోగులపై చర్యలు చేపట్టడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగ జీవితం నాశనం అవుతుందని, అందువల్ల వారి పట్ల కొంత దయ చూపించడమూ ముఖ్యమని టీసీఎస్‌ ముఖ్య కార్యకలాపాల అధికారి(సీఓఓ) ఎన్‌.గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు. ‘రెండు ఉద్యోగాలు చేసినట్లుగా సాక్ష్యాలున్నప్పుడు.. నియామక ఒప్పంద పత్రంలోని షరతుల ప్రకారం ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. అయితే ఇప్పుడిపుడే ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన యువత విషయంలో అలా వ్యవహరించకూడదు.

ఎందుకంటే.. చర్యలు తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగ జీవితానికి ముప్పు ఏర్పడుతుంది. గత ఉద్యోగం నుంచి తొలగింపు వెనక కారణాలు.. కొత్త ఉద్యోగం రాకుండా అడ్డుకుంటాయి. అందుకే వాళ్లపై కొంత దయ చూపించాలి’ అని ఆయన అన్నారు. ప్రతి ఉద్యోగిని కంపెనీ తన కుటుంబ సభ్యుడిగా అనుకుంటుందని, అందువల్ల ఏమైనా చర్యలు చేపడితే, ఆ కుటుంబ సభ్యుడి ఉద్యోగ జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కూడా కంపెనీ దృష్టి సారిస్తుందని తెలిపారు. ‘కొన్ని ఐటీ కంపెనీలు.. ఫ్రీల్యాన్సర్స్‌తో కలిసి పనిచేస్తుంటాయి. అయితే టీసీఎస్‌ లాంటి కంపెనీలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తాయి. అందువల్ల వినియోగదార్ల డేటా భద్రతను దృష్టిలో ఉంచుకొని మూన్‌లైటింగ్‌ లాంటి కార్యకలాపాలను కొనసాగించడానికి కంపెనీ ఒప్పుకోద’ని సుబ్రమణియమ్‌ చెప్పారు. అయితే చిన్న వయస్సులో వాళ్లకు శిక్ష వేయాలని తాము అనుకోవడం లేదని ఆయన తెలిపారు.

పరీక్షల్లో ఉత్తీర్ణులైతే వేతనం రెట్టింపు..

ప్రారంభ స్థాయి ఉద్యోగులకు ఎక్కువ కాలం పాటు ఒకే స్థాయిలో వేతన ప్యాకేజీని కొనసాగించడంపై సుబ్రమణియమ్‌ స్పందిస్తూ.. కొత్త వాళ్లకు ఆ ప్యాకేజీ సరిపోతుందని కంపెనీ భావిస్తోందని తెలిపారు. కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఏడాదిలోగా వారి వేతనం రెట్టింపయ్యే అవకాశాలూ ఉంటాయని చెప్పారు. ‘ఒక ఉద్యోగిని నియమించుకున్నప్పుడు.. 6 నెలల పాటు శిక్షణ కోసం కంపెనీ ఖర్చు చేసి, ఒక ప్రాజెక్టులో భాగం చేస్తుంది. గత కొన్నేళ్లలో సుమారు 20-30 శాతం మంది ఉద్యోగులు పరీక్షల్లో ఉత్తీర్ణులై.. వేతనాలను విజయవంతంగా రెట్టింపు చేసుకున్నార’ని ఆయన చెప్పారు. ఆఫీసుల్లో మార్గనిర్దేశకత్వం (మెంటార్‌షిప్‌) ద్వారా ఉద్యోగులు నేర్చుకునే వీలుంటుందని తెలిపారు. ఉన్నత స్థాయి నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. ‘2025 నాటికి కేవలం 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల నుంచి పనిచేసేలా టీసీఎస్‌ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే దీని కంటే ముందు.. కార్యాలయాల నుంచి పని చేసే ఉద్యోగుల సంఖ్యను 70 శాతానికి పెంచుకోవాలని కంపెనీ అనుకుంటోంద’ని ఆయన పేర్కొన్నారు. కార్యాలయాల నుంచి పనిచేసే విషయంలో చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారని, అయితే వాళ్లను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొంత మంది ఉద్యోగులైతే ఇంటి వద్ద నుంచి పనిచేసే నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని