Mukesh Ambani: దుబాయ్‌లో ముకేశ్‌ అ‘ధర’హో.. బీచ్‌ పక్కనే విలాసవంతమైన విల్లా కొనుగోలు!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ విదేశాల్లో అత్యంత విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో, బీచ్‌ పక్కన అత్యంత విలాసవంత విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Updated : 20 Oct 2022 07:02 IST

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ విదేశాల్లో అత్యంత విలువైన ఆస్తులను కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో, బీచ్‌ పక్కన అత్యంత విలాసవంత విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో ఆ నగరంలోనే 80 మిలియన్‌ డాలర్ల విలువైన నివాసాన్ని ముకేశ్‌ అంబానీ కొనుగోలు చేశారు. పామ్‌ జుమేరాలో కువైట్‌ దిగ్గజం మహమ్మద్‌ అల్‌షాయా కుటుంబానికి చెందిన ఒక విలాసవంత భవంతిని 163 మిలియన్‌ డాలర్ల (రూ.1300 కోట్లకు పైగా)తో ఖరీదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఆంగ్ల వార్తా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్‌’ వెల్లడించింది. అల్‌షాయాకు స్థానికంగా స్టార్‌బక్స్‌, హెచ్‌ అండ్‌ ఎం, విక్టోరియాస్‌ సీక్రెట్‌ వంటి రిటైల్‌ బ్రాండ్ల ఫ్రాంఛైజీలున్నాయి. పామ్‌ జుమేరా అనేది దుబాయ్‌లో పామ్‌ చెట్టు ఆకారంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఇందులో ఉన్నవన్నీ విలాసవంత విల్లాలే.

విదేశీ ఆస్తుల కొనుగోళ్లు..: రిలయన్స్‌ గతేడాది బ్రిటన్‌లో 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ను 79 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. న్యూయార్క్‌లోనూ ఒక భవంతి కోసం ముకేశ్‌ అంబానీ అన్వేషిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ చెబుతోంది. పామ్‌ జుమేరాలోని విల్లాను ఒకరు 163 మి.డాలర్లతో కొనుగోలు చేసినట్లు దుబాయ్‌ లాండ్‌ డిపార్ట్‌మెంట్‌ గత వారం పేర్కొంది. ఆ వ్యక్తి ఎవరో వెల్లడించలేదు. ఆ వ్యక్తి ముకేశ్‌ అంబానీయే అన్నది వార్తా సంస్థ కథనం. ఈ విషయంపై రిలయన్స్‌, అల్‌షాయా ప్రతినిధులు స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని