గూగుల్‌పై సీసీఐ మరో రూ.936 కోట్ల జరిమానా

గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 26 Oct 2022 02:59 IST

దిల్లీ: గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. గూగుల్‌పై సీసీఐ కొరడా ఝుళిపించడం గత రెండు వారాల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. పలు విపణుల్లో, ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందున సీసీఐ అక్టోబరు 20న రూ.1,337.76 కోట్ల జరిమానా వేసింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వ్యవస్థలో యాప్‌ డెవలపర్లకు గూగుల్‌ ప్లేస్టోర్‌ కీలక సరఫరా ఛానెల్‌గా వ్యవహరిస్తోంది. మార్కెట్‌కు వచ్చే యాప్‌లపై యాజమానులకు నియంత్రణ ఇస్తోంది. జరిమానాతో పాటు థర్డ్‌-పార్టీ బిల్లింగ్‌/ యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్‌ డెవలపర్లను అడ్డుకోరాదని సీసీఐ ఆదేశించింది. సీసీఐ తాజా ఆదేశాలపై గూగుల్‌ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఆండ్రాయిడ్‌ పరికరాల వ్యవహారంపై ఆదేశాలను సమీక్షిస్తామని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ సగటు టర్నోవర్‌లో జరిమానా మొత్తం 7 శాతానికి సమానం. ఆర్థిక వివరాలు, ఇతర పత్రాలను అందించడానికి గూగుల్‌కు 30 రోజుల సమయాన్ని సీసీఐ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని