గూగుల్‌ నియామకాల్లో కోత!

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 69.09 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2021 ఇదే త్రైమాసిక ఆదాయం 65.12 బి.డాలర్ల కంటే ఎక్కువే అయినా, విశ్లేషకుల అంచనా అయిన 70.58 బి.డాలర్ల కంటే తగ్గడం గమనార్హం.

Published : 27 Oct 2022 03:15 IST

ఫలితాలు అంచనాలను చేరనందునే

దిల్లీ: గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 69.09 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2021 ఇదే త్రైమాసిక ఆదాయం 65.12 బి.డాలర్ల కంటే ఎక్కువే అయినా, విశ్లేషకుల అంచనా అయిన 70.58 బి.డాలర్ల కంటే తగ్గడం గమనార్హం. ప్రకటనల ఆదాయం కూడా 53.13 బిలియన్‌ డాలర్ల నుంచి 54.48 బిలియన్‌ డాలర్లకు పెరిగినా, అంచనాల కంటే తక్కువగా నమోదైంది. త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహ పరచడంతో నియామకాల వేగాన్ని తగ్గిస్తామని, వ్యయాలు అదుపులో పెట్టనున్నట్లు ఆల్ఫాబెట్‌ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కఠిన సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. సమీక్షా త్రైమాసికంతో పోలిస్తే డిసెంబరు త్రైమాసికంలో ఉద్యోగ నియామకాలు సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని కంపెనీ సీఎఫ్‌ఓ రూత్‌ పోరట్‌ తెలిపారు. యూట్యూబ్‌ ప్రకటనల ఆదాయం తగ్గడమూ ప్రతికూల ప్రభావం చూపింది.
*గూగుల్‌ బలహీన ఫలితాలు ప్రకటించడంతో, మాంద్యం భయాలు మళ్లీ పెరిగాయి. వీటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తేనే, ప్రకటనదారులు తమ వ్యయాలు తగ్గించుకుంటారన్నది విశ్లేషకుల అంచనా. గతవారం స్నాప్‌చాట్‌ కూడా అత్యల్ప ఆదాయ వృద్ధిని నమోదుచేసింది. ఆదాయం కోసం ప్రకటనలపైనే ఆధారపడిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్‌ షేరు క్షీణతకూ గూగుల్‌ ఫలితాలు కారణమయ్యాయి.
మైక్రోసాఫ్ట్‌ సైతం: మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కూడా అజ్యూర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల వ్యాపార వృద్ధి అంచనాలను బలహీనంగా ప్రకటించింది. అదే సమయంలో నూతన నియామకాలతో పాటు ఖర్చులు తగ్గించుకుంటామని సంకేతాలు ఇచ్చింది. వ్యక్తిగత కంప్యూటర్‌లకు గిరాకీ తగ్గడం వల్లే, ప్రకటనల ఆదాయం - లాభం తగ్గడానికి కారణమయ్యాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని