Digital Rupee: నేటి నుంచే డిజిటల్‌ రూపాయి

దేశంలో తొలిసారిగా అధీకృత ‘డిజిటల్‌ రూపాయి’ మంగళవారం (నవంబరు 1) నుంచి వినియోగంలోకి రానుంది. ప్రయోగాత్మకంగా టోకు వినియోగానికే తొలుత అనుమతించనున్నారు.

Updated : 01 Nov 2022 08:49 IST

తొలుత ప్రయోగాత్మకంగా టోకు విభాగానికి
నెల లోపే రిటైల్‌లోనూ అమలు
ఎస్‌బీఐ సహా 9 బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి

ముంబయి: దేశంలో తొలిసారిగా అధీకృత ‘డిజిటల్‌ రూపాయి’ మంగళవారం (నవంబరు 1) నుంచి వినియోగంలోకి రానుంది. ప్రయోగాత్మకంగా టోకు వినియోగానికే తొలుత అనుమతించనున్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్‌ రూపాయిని జారీ చేస్తాయి. ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ-హోల్‌సేల్‌ (ఇRs-డబ్ల్యూ) ప్రయోగాత్మక కార్యకలాపాలు 2022 నవంబరు 1 నుంచి టోకు విభాగంలో మొదలవుతాయని’ సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది.

వేటికి ఉపయోగిస్తారంటే: ప్రస్తుతానికి ప్రభుత్వ సెక్యూరిటీల్లో   సెకండరీ మార్కెట్‌ లావాదేవీల సెటిల్‌మెంట్‌కు ఈ వర్చువల్‌ కరెన్సీని ఉపయోగిస్తారు. ఇందువల్ల ఇంటర్‌-బ్యాంక్‌ మార్కెట్‌ మరింత సమర్థంగా మారుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

ఉపయోగం ఏమిటి?: కేంద్ర బ్యాంకులో నగదు సెటిల్‌మెంట్‌లు తగ్గడం వల్ల, లావాదేవీ వ్యయాలు తగ్గుతాయి.

భవిష్యత్తులో: ప్రస్తుత ఫలితాలను బట్టి ఇతర టోకు లావాదేవీలకు, విదేశీ చెల్లింపులకు విస్తరిస్తారు.

రిటైల్‌ విభాగంలో నెలలోపే: డిజిటల్‌ రూపాయి-రిటైల్‌ విభాగంలో తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును నెలలోపే ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. పరిమిత వినియోగదార్లు-వ్యాపారుల బృందాలకు ప్రారంభిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.

ప్రస్తుత నగదు కొనసాగుతుంది: సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్‌ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కేంద్ర బ్యాంకులు సీబీడీసీలపై ఆసక్తి ప్రదర్శించాయి. కొన్ని ఇప్పటికే టోకు, రిటైల్‌లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు మొదలుపెట్టగా.. మరికొన్ని సొంత సీబీడీసీలపై పరిశోధన, పరీక్షలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని