బంగారం కొనేస్తున్నారు

దేశంలో బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతోందని, జులై-సెప్టెంబరులో ఇది కొవిడ్‌ ముందు స్థాయికి చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది.

Updated : 02 Nov 2022 07:20 IST

కొవిడ్‌ ముందు స్థాయికి గిరాకీ
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
ముంబయి

దేశంలో బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతోందని, జులై-సెప్టెంబరులో ఇది కొవిడ్‌ ముందు స్థాయికి చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. పుత్తడిపై కొనుగోలుదార్ల నుంచి అంచనాలకు మించిన ఆసక్తి వ్యక్తమవుతోందని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈఓ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. పండగల సీజన్‌కు తోడు బంగారం ధర తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రుణంపై కొనుగోలుకు అవకాశాలు పెరగడం వల్ల దక్షిణాది నగరాలు/పట్టణాల్లో ఆభరణాల కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డీరేట్లు పెరుగుతుండటం, రూపాయి బలహీన పడుతున్నందున, బంగారంపై ఆసక్తి కొనసాగుతుందనే భావిస్తున్నామన్నారు. నాలుగో త్రైమాసికంలో దీపావళి అమ్మకాలు బాగానే జరిగాయని, వివాహాది శుభకార్యాలు కూడా ముందున్నందున, ఏడాది మొత్తంమీద 750-800 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడుతుందనే అంచనాను వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి-సెప్టెంబరులో 559 టన్నుల బంగారం దేశంలోకి అధికారికంగా దిగుమతి అయ్యిందన్నారు. ‘2022 మూడో త్రైమాసికంలో పసిడి గిరాకీ ధోరణుల’పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం..

* జులై-సెప్టెంబరులో మొత్తం 191.7 టన్నుల పసిడికి దేశీయంగా గిరాకీ లభించింది. 2021 ఇదే కాల గిరాకీ 168 టన్నులతో పోలిస్తే, ఇది 14 శాతం అధికమని వెల్లడించింది.
* విలువ పరంగా చూస్తే.. ఇది రూ.71,330 కోట్ల నుంచి 19 శాతం అధికమై రూ.85,010 కోట్లకు చేరింది.
* ఆభరణాలకు గిరాకీ 125.1 టన్నుల నుంచి 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.53,330 కోట్ల నుంచి 22 శాతం అధికమై  రూ.64,860 కోట్లకు చేరింది.
* పెట్టుబడులకు నిదర్శనంగా భావించే పసిడి నాణేలు, బిస్కెట్లకు గిరాకీ 42.9 టన్నుల నుంచి 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.18,300 కోట్ల నుంచి 10 శాతం అధికమై రూ.20,150 కోట్లకు చేరింది.
* పునర్వినియోగానికి చేరిన బంగారం 20.7 టన్నుల నుంచి 23 శాతం తగ్గి 16 టన్నులకు పరిమితమైంది.
* ఆర్‌బీఐ కూడా జులైలో 13, సెప్టెంబరులో 4 టన్నుల మేర కొనుగోలు చేయడంతో, మొత్తం పసిడి నిల్వలు 785 టన్నులకు చేరాయి.

ప్రపంచవ్యాప్తంగా 1181.5 టన్నులు 

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు త్రైమాసికంలో 1181.5 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. ఏడాది క్రితం ఇదే కాల గిరాకీ 921.9 టన్నులతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ పెట్టుబడులు 47 శాతం తగ్గితే, లోహంపై మాత్రం 36 శాతం పెరిగి 351.1 టన్నులకు చేరాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు 90.6 టన్నుల నుంచి 399.3 టన్నులకు చేరడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని