రూ.30.88 లక్షల కోట్ల నగదు చెలామణి

2016 నవంబరు 8.. రూ.1000, రూ.500 నోట్ల రద్దు సమయానికి ప్రజల వద్ద చెలామణిలో ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లు.

Published : 07 Nov 2022 02:28 IST

2016 నవంబరు నుంచి 72% పెరిగింది

2016 నవంబరు 8.. రూ.1000, రూ.500 నోట్ల రద్దు సమయానికి ప్రజల వద్ద చెలామణిలో ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లు.

2022 అక్టోబరు 21.. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.30.88 లక్షల కోట్లు.. ఈ ఆరేళ్ల వ్యవధిలో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో చూస్తే, ఒక్క  యూపీఐ లావాదేవీలే రూ.12.11 లక్షల కోట్ల మేర జరిగాయి. అయినా కరెన్సీ నోట్లు, నాణేల వినియోగం ఏమాత్రం తగ్గకపోగా, 72% పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

* వస్తు, సేవల కొనుగోలు, వాణిజ్య సెటిల్‌మెంట్లు, లావాదేవీల కోసం ప్రజలు వినియోగించే నోట్లు, నాణేల విలువనే ప్రజల వద్ద ఉన్న నగదుగా వ్యవహరిస్తారు. ప్రతి 15 రోజులకోసారి ఆర్‌బీఐ చెలామణిలో ఉన్న నగదు వివరాలను అందిస్తుంటుంది. బ్యాంకుల్లో ఉన్న నగదును మినహాయించిన తర్వాతే చెలామణిలో ఉన్న నగదును వెల్లడిస్తుంది.

డిజిటల్‌ లావాదేవీలు పెరిగినా..

ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని తగ్గించి, అవినీతిని అరికట్టే ఉద్దేశంతోనే పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు నాడు ప్రధాని మోదీ ప్రకటించారు. డిజిటల్‌ లావాదేవీల వల్ల పారదర్శకత పెరుగుతుందని, నగదు ఎక్కడకు చేరుతుందో నిగ్గుతేలుతుందని భావించారు. కొవిడ్‌ పరిణామాల ఫలితంగా ఆన్‌లైన్‌ లావాదేవీలకు ప్రజలు అలవాటు పడ్డా, నగదు వినియోగం పెరుగుతూనే ఉంది. ‘డిజిటల్‌ లావాదేవీల సంఖ్య, పరిమాణం పెరుగుతున్నా, కరెన్సీ నోట్ల విలువ-జీడీపీ నిష్పత్తి కూడా పెరుగుతూనే ఉంద’ని ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని