Elon musk: ‘వేషాలెయ్యొద్దు’.. ఖాతా తీసేస్తా: ఎలాన్‌ మస్క్‌ హెచ్చరిక

ట్విటర్‌ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే.. శాశ్వతంగా ట్విటర్‌ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని సంస్థ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు.

Updated : 08 Nov 2022 07:20 IST

బోస్టన్‌: ట్విటర్‌ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే.. శాశ్వతంగా ట్విటర్‌ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని సంస్థ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. కొంత మంది ప్రముఖులు తమ డిస్‌ప్లే పేరును ఎలాన్‌ మస్క్‌గా మార్చి (ఖాతా పేర్లు కాదు).. ట్వీట్లు చేస్తుండడంతో మస్క్‌ ఇలా స్పందించారు. బ్లూటిక్‌ ఖాతాలకు నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్‌ నిర్ణయం తీసుకున్నాక, పలువురు సెలబ్రిటీలు తమ ట్విటర్‌ హ్యాండిళ్లలో మస్క్‌ ఫొటో, పేరు పెట్టి (వేషాలు మార్చి) నిరసన తెలిపారు. తమ ఖాతా పేర్లను మాత్రం సొంతానివే వాడారు. ఈ నేపథ్యంలోనే ‘ఖాతా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు గతంలో ట్విటర్‌ హెచ్చరికలు జారీ చేసేది. ఇకపై హెచ్చరికలు ఏమీ ఉండవు. తొలగింపులే’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఏ ఇతర పేరుకు తమ డిస్‌ప్లేను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్‌ను తాత్కాలికంగా కోల్పోతార’నీ తెలిపారు.

భారత్‌లో 90% సిబ్బంది ఇంటికి: ట్విటర్‌ తన భారత ఉద్యోగుల్లో 90% మందికి పైగా తొలగించింది. దీంతో కేవలం డజను మంది సిబ్బంది మాత్రమే మిగిలినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులు పేర్కొన్నారు. 100కు పైగా భాషలున్న భారత్‌లో, తగ్గించిన సిబ్బందితో కంపెనీ కార్యకలాపాలు ఎలా నడుపుతుందో చూడాల్సి ఉంది. ‘అవమానం, అనిశ్చితి’.. సంస్థలో ప్రస్తుత పరిస్థితిని తెలపడానికి ఇవే సరైన పదాలని ‘ఉద్యోగం ఊడిందంటూ తెలిపే పింక్‌ స్లిప్‌’ అందుకున్న ట్విటర్‌ ఇండియా సిబ్బంది ఒకరు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని