పెద్ద నోట్ల రద్దు నుంచి డిజిటల్‌ రూపీ

అవినీతిని - నకిలీ నోట్లను అరికట్టేందుకు, నల్లధనాన్ని నివారించేందుకు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రకటించింది.

Updated : 09 Nov 2022 03:38 IST

ఈనాడు వాణిజ్య విభాగం


 

అవినీతిని - నకిలీ నోట్లను అరికట్టేందుకు, నల్లధనాన్ని నివారించేందుకు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రకటించింది. తదుపరి కొత్త నోట్లు వచ్చినా, నకిలీలు ఆగలేదు. నగదు చెలామణి కూడా మరింత పెరిగింది. ఇదే సమయంలో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య శరవేగంగా పెరిగింది. కొత్తగా డిజిటల్‌ రూపాయిని కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టినందున, భవిష్యత్తులో  ఆర్థిక కార్యకలాపాలు ఏ రూపం దాలుస్తాయో చూడాలి.

2016 నవంబరు 8: రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని
రూ.17.97 లక్షల కోట్లు:  ఆ సమయానికి 133 కోట్ల మంది వద్ద ఉన్న నగదు విలువ
86 శాతం: ప్రజల వద్ద ఉన్న నగదులో రద్దయిన పెద్ద నోట్ల వాటా
రూ.2000 నోటు: 2016 నవంబరు 10 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ
354.9 కోట్లు: 2016-17లో ప్రభుత్వం ముద్రించిన రూ.2000 నోట్ల సంఖ్య ఇదీ
2017 జనవరి: ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.7.8 లక్షల కోట్లు మాత్రమే
2021 అక్టోబరు 8: ప్రజల వద్ద నగదు విలువ రూ.28.30 లక్షల కోట్లు
2022 నవంబరు 8: పెద్దనోట్ల రద్దు జరిగి ఆరేళ్లు పూర్తి
రూ.30.88 లక్షల కోట్లు: ప్రస్తుతం 141 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న నగదు విలువ
71.84 శాతం: ఈ ఆరేళ్లలో పెరిగిన నగదు విలువ


రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేత

వ్యవస్థలో ఒక్కసారిగా నగదు చెలామణి నిలిచిపోయినందున,  రూ.2,000 నోట్లను ముందుగా అందుబాటులోకి తెచ్చారు. తదుపరి రూ.500, కొత్తగా రూ.200 నోట్లనూ తెచ్చారు. క్రమంగా రూ.500,   రూ.200 నోట్ల ముద్రణ పెంచి,  రూ.2,000 నోట్ల ముద్రణను 2019 నుంచీ నిలిపి వేశారు. వీటిని ఏటీఎంలలో కూడా ఎక్కడా అందుబాటులో ఉంచడం లేదు. వీటితో అవినీతి, హవాలా కార్యకలాపాలు పెరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఇది ఒకరకంగా పెద్దనోట్ల రద్దు ప్రక్రియ రెండో దశగా చెప్పొచ్చు.
నకిలీలు ఆగలేదు: రూ.2000 నోటును ప్రవేశ పెట్టిన 2016లోనే ఇలాంటి నకిలీ నోట్లు 2272ను కనిపెట్టగా, 2020కి ఆ సంఖ్య 2,44,834కు పెరిగింది.  


10.7 శాతం  

2017-18 జీడీపీలో నగదు నిష్పత్తి
14.4 శాతం  
2020-21 జీడీపీలో నగదు నిష్పత్తి  


ఈ నోట్ల ముద్రణ పరిస్థితి
2016-17 354.3 కోట్ల నోట్లు
2017-18 11.2 కోట్ల నోట్లు
2018-19 4.7 కోట్ల నోట్లు


ఆరేళ్ల ప్రస్థానంలో..

పెద్దనోట్ల రద్దుకు ముందు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాల వద్ద చెల్లింపులు, ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతాల మధ్య నగదు బదిలీ జరిగేది. 2016 ఏప్రిల్‌ 11న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలకు 21 బ్యాంకులతో ప్రయోగాత్మకంగా అప్పటి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ రఘురాం రాజన్‌ శ్రీకారం చుట్టారు. అదే ఏడాది ఆగస్టు 25న గూగుల్‌ పే ఆవిష్కరణతో, దేశంలో చెల్లింపుల తీరే మారింది. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు నగదును బ్యాంక్‌ ఖాతాలు, ఫోన్‌ నెంబర్లకు బదిలీ చేయొచ్చు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ చెల్లింపులూ జరపొచ్చు. ప్రస్తుతం 365 బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ లావాదేవీల్లో అత్యధికులు యూపీఐనే వాడుతున్నా, దేశంలో దాదాపు 15 కోట్ల మందికి బ్యాంక్‌ ఖాతాలే లేనందున, నగదు కూడా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు