Keka: ‘కేక’కు రూ.470 కోట్ల పెట్టుబడి

కంపెనీల మానవ వనరుల విభాగానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించే అంకుర సంస్థ కేక రూ.470 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్‌ ఈ మొత్తాన్ని సమకూర్చింది.

Updated : 10 Nov 2022 09:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: కంపెనీల మానవ వనరుల విభాగానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించే అంకుర సంస్థ కేక రూ.470 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్‌ ఈ మొత్తాన్ని సమకూర్చింది. సాఫ్ట్‌వేర్‌-యాజ్‌-ఏ-సర్వీస్‌ (సాస్‌) విభాగంలో పెద్దమొత్తం పెట్టుబడి సాధించిన సంస్థల్లో కేక ఒకటిగా నిలిచింది. ఈ నిధులను సంస్థ తన విస్తరణకు వినియోగించనుంది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులుండగా, ఏడాదిలో 1,000కి పెంచనుంది. ఏప్రిల్‌లో 95 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయానికి మారనుంది. ఐరోపాతో పాటు ఇతర దేశాల్లోనూ కార్యకలాపాలను విస్తరించనుంది. 2016లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 6,500 ఎంఎస్‌ఎంఈల్లో 15 లక్షల మంది ఉద్యోగులకు సేవలను అందిస్తోంది. 20-2000 మంది ఉద్యోగులున్న సంస్థలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని కేక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విజయ్‌ యలమంచిలి తెలిపారు. మానవ వనరుల నిర్వహణ, సెలవులు, హాజరు, పేరోల్‌ వంటి వాటిల్లో తమ ఉత్పత్తులు సహాయం చేస్తాయని పేర్కొన్నారు. ఐటీ, ఔషధ, తయారీ, అకౌంటింగ్, ఫిన్‌టెక్‌ కంపెనీలు తమ సేవలను వాడుతున్నాయన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను భారత్‌ నుంచి అందించాలన్నదే తమ లక్ష్యమని, అందుకే తమ సంస్థకు తెలుగు పేరు ‘కేక’ను పెట్టినట్లు విజయ్‌ తెలిపారు. ప్రస్తుత వార్షిక అంచనా రాబడి (ఏపీఆర్‌) రూ.85 కోట్ల వరకు ఉందన్నారు. మధ్యస్థాయి సంస్థలు తమ హెచ్‌ఆర్‌ ప్రక్రియను ఆధునికీకరించుకునేందుకు కేక ఉత్పత్తులు తోడ్పడతాయని, దీనికి పెట్టుబడులు అందించడంపై తాము సంతోషంగా ఉన్నట్లు వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ ప్రిన్సిపల్‌ రిశిత్‌ దేశాయ్‌ అన్నారు.

ఇబ్బందేమీ లేదు: అమెరికా సహా పలు దేశాల్లో మాంద్యం తరహా పరిస్థితులున్నా, భారతీయ అంకురాలకు ఇబ్బందేమీ లేదని విజయ్‌ యలమంచిలి తెలిపారు. ఆయా దేశాలతో లావాదేవీలు అధికంగా ఉన్న సంస్థలే ఇక్కడ ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు మాత్రం నిధులు సమకూర్చడంలో తొందరపడక, అన్ని విషయాలూ పరిశీలించి, అవసరమైన మేరకే అందిస్తున్నారని వెల్లడించారు. భారతీయ సాస్‌ మార్కెట్‌ 25 బిలియన్‌ డాలర్లుగా ఉందని, ఏటా 8-10 శాతం వృధ్ధి కనిపిస్తోందన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు