‘ఫేస్‌బుక్‌’లో 11,000 మందికి ఉద్వాసన

ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు.

Published : 10 Nov 2022 01:40 IST

మొత్తం సిబ్బందిలో 13 శాతానికి సమానం

న్యూయార్క్‌: ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు. ‘కరోనా అనంతరమూ వేగవంతమైన వృద్ధి ఉంటుందన్న అంచనాలతో, గతంలో నియామకాల విషయంలో దూకుడుగా నిర్ణయం తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను అంచనా వేసినట్లుగా అది జరగలేద’ని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఇటీవలే ట్విటర్‌ యజమానిగా మారిన మస్క్, కూడా ‘రోజుకు 4 మిలియన్‌ డాలర్ల మేర నష్టమొస్తోందంటూ తన 7500 మంది ఉద్యోగుల్లో సగం మేరకు గతవారం తొలగించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ సమయంలో, అప్పటి అవసరాల మేరకు వేగంగా నియమాకాలు చేపట్టిన ఇతర టెక్‌ కంపెనీలు కూడా, ఇప్పుడు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి.

ఇవీ కారణాలు..

* కొవిడ్‌ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి లాక్‌డౌన్‌లు అమలు కావడంతో, ప్రజలు ఇళ్లలో కంప్యూటర్ల ముందు, ఫోన్లతోనే ఎక్కువగా గడిపారు. అందువల్లే ఫేస్‌బుక్‌ సహా ఇతర సామాజిక మాధ్యమ కంపెనీలు ఆర్థికంగా రాణించాయి లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలు తమ వృత్తి, వ్యాపారాలకు వెళ్తున్నందున, సామాజిక మాధ్యమాలకు కేటాయించే సమయం తగ్గింది. ఫలితంగా ఆయా సంస్థలకు ఆదాయ వృద్ధి పరిమితమవుతోంది. మెటా అయితే తన చరిత్రలోనే తొలి త్రైమాసిక ఆదాయ క్షీణతను ఇటీవల నమోదు చేసింది.

* స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన ‘మెటావర్స్‌’పై మెటా 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.82,000 కోట్ల) మేర పెట్టుబడులు పెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇది వినియోగదార్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

* యాపిల్‌ ప్రైవసీ టూల్స్‌తో సంస్థకు సవాళ్లు ఎదురయ్యాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌ వినియోగదార్లను వారి అనుమతి లేకుండా ట్రాక్‌ చేయడం, యాడ్స్‌ పోస్ట్‌ చేయడం కష్టమవుతోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌కు టిక్‌టాక్‌తో పోటీ తీవ్రమైంది.

సిబ్బందికి ప్యాకేజీ ఇలా: ‘మా అన్ని వ్యాపారాల్లో వ్యయాలను తగ్గిస్తున్నాం. బడ్జెట్లలో కోత, ప్రోత్సాహకాలు- కార్యాలయాల తగ్గింపు వంటివి చేపట్టాం. అయినా వ్యయాలు పెద్దగా తగ్గలేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ‘16 వారాల మూల వేతనంతో పాటు, కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి రెండు వారాల చొప్పున వేతనాన్ని తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. ఆరు నెలల పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కొనసాగుతుంద’ని ఆయన స్పష్టం చేశారు.

హెచ్‌1బీ వీసాదార్లకు మద్దతు: సాధారణంగా హెచ్‌1బీ వీసా కలిగిన వారు అమెరికాలో నివాసం ఉంటూ మూడేళ్ల పాటు పనిచేయొచ్చు. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే వీరికి ఉద్యోగం పోతే, 60 రోజుల్లోగా వీసాను స్పాన్సర్‌ చేసే మరో కంపెనీలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాను వీడాల్సిందే. అమెరికా టెక్‌ కంపెనీలు నియమించుకునేవారిలో ఎక్కువ భాగం హెచ్‌1బీ సిబ్బందే ఉంటారు. అందులోనూ భారత్‌ వంటి దేశాల నుంచే అధికంగా ఉంటారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోల్పోతున్న వారిలో హెచ్‌1బీ వీసాదార్లు ఉంటే వారికి ‘ఇమిగ్రేషన్‌ మద్దతు’ ఇస్తామని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ‘వీసాపై ఉన్న ఉద్యోగులకు ఇది కష్ట సమయం. మీకు, మీ కుటుంబానికి ఏం కావాలన్నదానిపై ఆధారపడి, మీకు మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ఇమిగ్రేషన్‌ స్పెషలిస్టులు మా వద్ద ఉన్నార’ని ఆయన అన్నారు.


‘‘ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలకు బాధ్యత నాదే. ఆయా కుటుంబాలకు ఇందువల్ల ఎంత కష్టం ఏర్పడుతుందో నాకు తెలుసు. లేఆఫ్‌నకు గురైన వారికి నా క్షమాపణలు. కంపెనీని మరింత బలోపేతం చేయడానికి వ్యయాల కోత, నూతన నియామకాల నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నాం.’’

- ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని