చైనా +1.. మనకు గొప్ప అవకాశం

వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవటంపై వ్యాపార సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు.

Published : 13 Nov 2022 01:31 IST

సీఐఐ దక్షిణ ప్రాంత సదస్సులో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవటంపై వ్యాపార సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. నాణ్యత, వ్యయాల పరంగా గట్టి పోటీ ఇవ్వగలగాలన్నారు. సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) దక్షిణ ప్రాంత విభాగం సమావేశం శనివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, దాదాపు 19,000 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్‌, అతిపెద్ద ఇంక్యుబేషన్‌ కేంద్రమైన టీ-హబ్‌, ప్రొటోటైప్‌ కేంద్రమైన టీ-వర్క్స్‌... వంటి వినూత్నమైన సదుపాయాలు హైదరాబాద్‌ నగరంలో ఉన్నట్లు తెలిపారు. అటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇటు బయోటెక్నాలజీ రంగాలు విస్తరించిన ప్రత్యేకతా హైదరాబాద్‌కు దక్కుతుందని అన్నారు. దీనికి అదనంగా పటాన్‌చెరులో అతిపెద్ద మెడ్‌టెక్‌ పార్కు సిద్ధం అవుతోందని తెలిపారు. శ్వేత విప్లవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని,  మాంస ఉత్పత్తులు, వంట నూనెల విభాగంలోనూ క్రియాశీలకమైన పాత్ర పోషించటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. ‘చైనా + 1’ మనకు గొప్ప అవకాశమని, దీన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని వ్యాపార సంస్థలకు కేటీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్‌ పర్సన్‌ సుచిత్ర ఎల్ల, డిప్యూటీ ఛైర్మన్‌ కమల్‌ బాలి, రీజినల్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎంపీ జయేశ్‌  తదితరులు పాల్గొన్నారు.


వ్యాపార వివాదాల పరిష్కారానికి

వినూత్న విధానాలు అవసరం..

జస్టిస్‌ ఎన్వీ రమణ

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో వ్యాపార వివాదాల పరిష్కారానికి వినూత్న విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సీఐఐ- దక్షిణ ప్రాంత సమావేశంలో ఆయన ప్రత్యేకోపన్యాసం చేశారు. న్యాయస్థానాలు మాత్రమే తమ వివాదాలను పరిష్కరిస్తాయనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలు ఏ ఇతర వేదికలను సంప్రదించడం లేదని, ఇది సరికాదని పేర్కొన్నారు. న్యాయప్రక్రియలో న్యాయస్థానాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాలన్నింటికీ పాత్ర ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ‘వివాదాల పరిష్కారానికి ఇంకెన్నో ప్రత్యామ్నాయ వేదికలు, యంత్రాంగాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో త్వరితంగా వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఈ వేదికలు కల్పిస్తున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించే ముందు ఆయా వేదికలను పరిశీలించాలి’ అని సూచించారు. తన ముందుకు వచ్చిన వివాదాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పరిష్కారించటానికి తాను ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ప్రత్యామ్నాయ విధానాల్లో వివాదాలను పరిష్కరించుకునే యత్నాలను కోర్టులూ ప్రోత్సహిస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార వ్యవస్థ దేశంలో గత రెండు దశాబ్దాల్లో ఎంతో విస్తరించిందని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, తమ వివాదాల పరిష్కారానికి విభిన్నమైన మార్గాలను అన్వేషించాలని కోరారు.

వ్యాపార సంస్థలు వివాదం ముదరకుండా,  సంప్రదింపులతో పరిష్కరించుకునేందుకు మొగ్గుచూపాలని సూచించారు. న్యాయవ్యవస్థ సమర్థత పెరిగేందుకు, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను గుర్తించేందుకు సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాలు కృషి చేయాలని కోరారు. ఇటువంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తాము ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను ప్రస్తావించాలని సూచించారు. లేని పక్షంలో ఆయా చట్టాల్లోని మంచి చెడుల గురించి ఎలా తెలుస్తుందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని