House Rates: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగాయ్‌

నిర్మాణ సామగ్రి ధరలతో పాటు గిరాకీ పెరిగినందున, దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో సగటున 6 శాతం వృద్ధి కనిపిస్తోందని క్రెడాయ్‌, కోలియర్స్‌ ఇండియా, లియాసెస్‌ ఫోరాస్‌  సర్వే తెలిపింది.

Updated : 17 Nov 2022 07:44 IST

దిల్లీ: నిర్మాణ సామగ్రి ధరలతో పాటు గిరాకీ పెరిగినందున, దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో సగటున 6 శాతం వృద్ధి కనిపిస్తోందని క్రెడాయ్‌, కోలియర్స్‌ ఇండియా, లియాసెస్‌ ఫోరాస్‌  సర్వే తెలిపింది. జులై-సెప్టెంబరులో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగాయి. చదరపు అడుగుకి సగటు ధర రూ.9,266 పలుకుతోంది. దిల్లీలో ధరలు గరిష్ఠంగా 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ.7,741గా ఉంది. కోల్‌కతాలో 12 శాతం పెరిగి, చ.అడుగు రూ.6,594గా పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 11 శాతం, పుణేలో 9 శాతం, బెంగళూరులో 8 శాతం చొప్పున ధరలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. చెన్నై, ముంబయిలలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబయిలో చదరపు అడుగు ధర రూ.19,485గా ఉంది. 2022 ప్రారంభం నుంచీ ఇళ్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ పరిణామాల అనంతరం చాలామంది సొంతింటి కొనుగోలు కోసం ఆలోచిస్తున్నారని, ఫలితంగా గిరాకీలో వృద్ధి కనిపిస్తోందని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్ష్‌ వర్ధన్‌ పటోడియా తెలిపారు. లీయాసెస్‌ ఫోరాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం అమ్మకాలు గతంతో పోలిస్తే 16శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరుగుతున్నా, విక్రయాలపై ప్రతికూల ప్రభావమేమీ కనిపించడం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు