Car Deliveries: కార్లు ఇచ్చేద్దాం చకచకా

కార్ల కోసం వినియోగదార్లు బుకింగ్‌ చేసుకున్న స్థాయిలో, సరఫరాలు చేయడం కంపెనీలకు వీలు కావడం లేదు. ఫలితంగా గిరాకీ ఉన్న మోడళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.

Updated : 18 Nov 2022 12:24 IST

వేచిచూసే సమయం తగ్గింపు దిశగా చర్యలు
ఇంజిన్ల తయారీ సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు
రూ.20,000 కోట్లు వెచ్చించనున్న టాటా, మారుతీ, మహీంద్రా

ముంబయి: కార్ల కోసం వినియోగదార్లు బుకింగ్‌ చేసుకున్న స్థాయిలో, సరఫరాలు చేయడం కంపెనీలకు వీలు కావడం లేదు. ఫలితంగా గిరాకీ ఉన్న మోడళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు దిగ్గజ కంపెనీలు రంగంలోకి దిగాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థలు గిరాకీకి తగ్గట్లుగా సంప్రదాయ ఇంజిన్ల (ఐసీఈవీ) తయారీ పెంపునకు నడుం కట్టాయి. భారీ ‘వెయిట్‌లిస్ట్‌’లో ఉన్న మోడళ్ల ఉత్పత్తి పెంచేందుకు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ మూడు కంపెనీలు కలిసి రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టొచ్చని ఆయా కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్‌ఓ) వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.

మహీంద్రా: రూ.7,900 కోట్లు

డీజిల్‌ మోడళ్లపై సంస్థ గట్టిగా దృష్టి సారిస్తోంది. రాబోయే 12-15 నెలల్లో ఎస్‌యూవీ తయారీ సామర్థ్యాన్ని 6 లక్షల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకు నెలకు 29,000 కార్లను ఉత్పత్తి చేసిందీ కంపెనీ. దీంతో ఎక్స్‌యూవీ700 వంటి మోడల్‌ కోసం వేచిచూసే సమయం 22 నెలల వరకు పెరిగింది. అందుకే ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం మూడేళ్లలో రూ.7,900 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఈ ఏడాది చివరికల్లా నెలకు 39,000; 2023 చివరకు నెలకు 49,000 చొప్పున కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పెండింగ్‌లో ఉన్న మొత్తం 2.6 లక్షల కార్ల బుకింగ్‌లను త్వరగా సరఫరా చేయగలమని అనుకుంటోంది.

టాటా మోటార్స్‌: రూ.6,000 కోట్లు

ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ఉత్పత్తి పెంచేందుకు రూ.6,000 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నెలకు 50,000 వాహనాలు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ సామర్థ్యాన్ని నెలకు 55,000కు చేర్చాలని భావిస్తోంది. ఫోర్డ్‌ నుంచి కొన్న సనంద్‌ ప్లాంట్‌ కార్యకలాపాలు మొదలైతే నెలకు అదనంగా 25,000-30,000 వాహనాలు తయారు చేయొచ్చు. దీంతో వార్షిక సామర్థ్యం 9 లక్షలకుపైగా చేరుతుంది. గత ఏడాదిన్నరగా ప్రయాణికుల వాహనాల వ్యాపారంలో గిరాకీ పెరిగిందని, అందుకే మూలధన వ్యయాలను పెంచామని కంపెనీ చెబుతోంది. రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌, డిఫెండర్‌ ఎస్‌యూవీల గిరాకీ దృష్ట్యా తన బ్రిటిష్‌ అనుబంధ కంపెనీ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌పై రూ.23,500 కోట్ల పెట్టుబడులను కొనసాగించనుంది.

మారుతీ: రూ.7,000 కోట్లు

హరియాణలో కొత్త ప్లాంటు తొలిదశ, కొత్త మోడళ్ల కోసం మారుతీ సుజుకీ రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచించుకుంది. ఈ ఏడాదికి ముందుగా అనుకున్న పెట్టుబడులతో పోలిస్తే 40 శాతం ఎక్కువ ఇది.
విద్యుత్‌ వాహనాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 కల్లా మొత్తం వాహన అమ్మకాల్లో ప్రైవేటు కార్లు 30% (100 శాతం నుంచి సవరించారు) వాణిజ్య వాహనాలు 70%, బస్సులు 40%, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు 80% మేర విద్యుత్‌తో నడిచేవే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే జాతీయ రహదారుల వెంబడి ఛార్జింగ్‌ వసతుల లేమి కారణంగా ఈవీలకు భారీ ఆదరణ దక్కడానికి మరింత సమయం పట్టవచ్చని వాహన విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా నియంత్రణలకు అనుగుణంగా కొత్త ఐసీఈ మోడళ్ల కోసం మూలధనాన్ని కంపెనీలు కొనసాగిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు