వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై రూ.500 కోట్ల వరకు జరిమానా

వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తే రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.

Published : 19 Nov 2022 03:19 IST

డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ముసాయిదా విడుదల

ఈనాడు, దిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తే రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం విడుదల చేసిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు-2022 ముసాయిదా’లో దీనిని పొందుపరిచింది. ఈ ఏడాది ఆగస్టులో ఉపసంహరించుకున్న డేటా భద్రత బిల్లు స్థానంలో ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొచ్చింది. దీనిపై సలహాలు, సూచనలను డిసెంబరు 17లోగా ప్రభుత్వానికి పంపించవచ్చని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ట్విటర్‌ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ‘ద డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌’ బిల్లు అన్నది చట్ట రూపంలో ఒకవైపు ప్రజలకు హక్కులు, బాధ్యతలు కల్పిస్తుంది. మరోవైపు చట్టపరమైన నిబంధనలకు లోబడి డేటా సేకరణకు అనుమతిస్తుంది. డేటా ఎకానమీని దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగేందుకు డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసేందుకు కూడా ముసాయిదా ప్రతిపాదించింది.  
ప్రస్తుతం మన దేశంలో 76 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇది 120 కోట్లకు చేరుతుందని అంచనా. ఇలాంటి సమయంలో డేటా వినియోగానికి సంబంధించి నిబంధనలు, చట్టాలు రూపొందించకపోతే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్లే ఇంటర్నెట్‌ వినియోగానికి సంబంధించి నిబంధనలు రూపొందించడం ప్రాథమిక సూత్రంగా మారింది’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

జరిమానా ఎలాగంటే..

ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేసినట్లు ఈ బిల్లు కింద ఏర్పడిన విచారణ మండలి (బోర్డు) నిర్ణయిస్తే అలాంటి వారిపై గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించడానికి ఇందులో వీలు కల్పించారు.
డేటా ప్రాసెసర్లు, లేదంటే డేటా సేకరించిన సంస్థలు తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా డేటా బ్రీచ్‌కు కారణమైతే రూ.250 కోట్ల దాకా జరిమానా విధించవచ్చు.
ఫిర్యాదుల పరిష్కార బోర్డును నోటిఫై చేయడంలో విఫలమైనా, చిన్నారులకు సంబంధించిన నిబంధనలు సరిగా అమలుచేయకపోయినా రూ.200 కోట్ల పెనాల్టీ వేయొచ్చు.
చిన్నారుల డేటాను సేకరించేట్లయితే ముందుగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. చిన్నారుల డేటా సేకరణ, వినియోగానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 కోట్ల వరకు జరిమానా విధించడానికి వీలుంది.

ఫిర్యాదులు ఇలా..

డేటా సేకరణ, వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు, పరిష్కారం కోసం ఒక సమర్థ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ప్రతి డేటా సేకరణదారూ ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించిన ఫోన్‌ నెంబర్‌, ఇతర వివరాలను ప్రదర్శించాలి. సేకరించిన డేటాను భారత్‌ వెలుపల ఏయే దేశాలకు బదిలీచేయొచ్చన్నది కేంద్ర ప్రభుత్వం తర్వాత నోటిఫై చేస్తుంది. అలా కేంద్రం చెప్పిన దేశాలకు మాత్రమే ఈ వ్యక్తిగత డేటాను బదిలీచేయొచ్చు. ఈ విషయంలో నమ్మకమైన దేశాల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంది.

ఏడు సూత్రాల ఆధారంగా బిల్లు రూపకల్పన

1. వ్యక్తుల డేటాను సంస్థలు చట్టబద్ధంగా, పారదర్శకంగా, వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా ఉపయోగించాలి.
2. ఏ ఉద్దేశం కోసమైతే సమాచారాన్ని సేకరిస్తారో దాని ఉపయోగించాలి.
3. ఏదైనా పనికోసం ఎంత సమాచారం అవసరమో కేవలం అంతవరకు సంబంధించిన వివరాలనే సేకరించాలి.
4. వ్యక్తిగత డేటా విస్పష్టంగా, తాజాగా ఉండేలా చూడాలి.
5. సేకరించిన డేటాను నిరంతరంగా నిల్వచేసి పెట్టకూడదు.  
6. ఇలా సేకరించిన డేటాను అనధికారికంగా తీసుకోవడం, లేదంటే ప్రాసెస్‌ చేయడానికి వీలులేకుండా తగిన రక్షణ ఏర్పాట్లుచేయాలి. వ్యక్తిగత డేటాలోకి జొరబడకుండా ఇది తప్పనిసరి.
7. ఏదైనా పనికోసం వ్యక్తిగత డేటాను ప్రాసెసింగ్‌ చేయాలని ఎవరైతే నిర్ణయిస్తారో ఆ కార్యక్రమానికి వారే పూర్తిగా వ్యక్తిగత జవాబుదారీ వహించాలి అన్న సూత్రాలను ఈ బిల్లు రూపకల్పనలో ఉపయోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని