త్వరలో ఆహార ద్రవ్యోల్బణ అంచనా విధానం
కొవిడ్-19 మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఉక్రెయిన్ యుద్ధం రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంతో సరికొత్త సవాళ్లు
విస్తృత పరిశోధనలతో పరిష్కారాలు కనుగొనాలి
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఈనాడు - హైదరాబాద్
కొవిడ్-19 మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఉక్రెయిన్ యుద్ధం రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత, ఇంధన కొరత తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ వార్షిక సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో విధాన పరిశోధనకు విశేష ప్రాధాన్యం ఏర్పడిందని, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ఈ పరిశోధనలు దోహదపడాలని ఆయన సూచించారు. ఇంకా దాస్ ఏమన్నారంటే..
ద్రవ్యోల్బణ ముప్పు అందువల్లే
కొవిడ్ మహమ్మారి విస్తరించిన తరుణంలో ప్రభుత్వ విధానాలు ఖరారు చేయటానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం ఎంతో కష్టంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కుప్పకూలాయి. దీనివల్ల వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెనుప్రభావం పడింది. ముఖ్యంగా సరకుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సరఫరాల కోసం ఏ ఒక్కరి మీదో లేక ఏ ఒక్క దేశం మీదో ఆధారపడడం సరికాదనే విషయం స్పష్టమైంది. ఈ పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముప్పు తలెత్తింది. దీనికి తగిన పరిష్కారాలు అన్వేషించడంలో పాలక వర్గాలు తలమునకలుగా మునిగిపోయాయి. వివిధ దేశాలు పెద్దఎత్తున ఆర్థిక, ద్రవ్య నిర్ణయాలు తీసుకోవడం ఈ క్రమంలోని చర్యలే. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, పరిష్కార మార్గాలను అందించడంలో ఆర్థిక పరిశోధనల పాత్ర ఎంతగానో ఉంటుంది.
కొత్తతరం సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఆర్‌బీఐలోని పరిశోధనల విభాగం ఇటువంటి సవాళ్లకు సమర్థంగా స్పందించే నైపుణ్యం, సత్తా సమకూర్చుకోవాలి. దీనికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున అందిపుచ్చుకోవాలి. బిగ్ డేటా, కృత్రిమ మేధ(ఏఐ), యంత్ర అభ్యాసం (మెషీన్ లెర్నింగ్) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. సమాచార సేకరణ, విశ్లేషణ సామర్థ్యాన్ని బహుముఖంగా పెంచుకోవాలి. పరిశోధనా పత్రాలు ప్రచురించాలి. ప్రాంతీయ అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని పరిశోధనలు నిర్వహించాలి. ఇటీవల కాలంలో ఆర్‌బీఐ పరిశోధనల విభాగం ఎంతో ముఖ్యమైన సర్వేలు, సమాచార విశ్లేషణలను అందిస్తోంది.
అప్రమత్తంగానే ఉండాలి
త్వరలో ఆహార ద్రవ్యోల్బణ అంచనా విధానాన్ని (ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఫ్రేమ్‌వర్క్) ఆవిష్కరించనున్నాం. దీని కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. దీని కోసం వ్యవసాయం, ఆహార రంగాలకు చెందిన పలువురు నిపుణులతో కలిసి చర్చిస్తున్నాం. తమ పరిధిలోని ఇతర పరిశోధనాంశాల విషయంలోనూ ఇదే విధంగా భాగస్వామ్యాలతో ముందుకు సాగుతున్నాం. కొవిడ్- 19, ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం ప్రధానమైన సవాళ్లు. ఈ సవాళ్లు ఇంకా తొలగిపోలేదు. వీటికి సంబంధించిన మార్పులు మనం ఇంకా చూస్తాం. అందువల్ల ఈ అంశాలకు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇటువంటి సవాళ్లకు ఆర్‌బీఐ పరిశోధన విభాగం సమర్థంగా స్పందించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!