నకిలీ ఆన్‌లైన్‌ సమీక్షలకు అడ్డుకట్ట

ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ ఆన్‌లైన్‌ సమీక్ష(రివ్యూ)ల నిరోధానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై అందించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి అన్ని పెయిడ్‌ వినియోగదారు సమీక్ష వివరాలను స్వచ్ఛందంగా తెలియజేయాల్సి ఉంటుంది.

Published : 22 Nov 2022 07:06 IST

నిరోధానికి కొత్త నిబంధనలు
సరఫరాదారు, థర్డ్‌ పార్టీ వ్యక్తులు రివ్యూలు రాయరాదు
ప్రస్తుతానికి స్వచ్ఛందంగానే పాటించాలి
25 నుంచి అమల్లోకి

దిల్లీ: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ ఆన్‌లైన్‌ సమీక్ష(రివ్యూ)ల నిరోధానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై అందించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి అన్ని పెయిడ్‌ వినియోగదారు సమీక్ష వివరాలను స్వచ్ఛందంగా తెలియజేయాల్సి ఉంటుంది. తాజా నిబంధనలతో వినియోగదారులు కొనుగోలు సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడనుంది. సరఫరాదారు లేదా థర్డ్‌ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు సమీక్షలు రాయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత రూపొందించిన ఈ బీఐఎస్‌ ప్రమాణాలు నవంబరు 25 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతానికి స్వచ్ఛందమే అయినప్పటికీ.. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై నకిలీ సమీక్షల బెడద కొనసాగితే ప్రభుత్వం నిబంధనల అమలును తప్పనిసరి చేసే యోచనలో ఉంది. ఆన్‌లైన్‌ వినియోగదారు సమీక్షల కోసం కొత్త ప్రమాణాలు ‘ఐఎస్‌ 19000: 2022’ను బీఐఎస్‌ రూపొందించిందని వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఏ సంస్థలకు వర్తిస్తుందంటే..

ఆన్‌లైన్‌లో సమీక్షలు ప్రచురించే ప్రతి సంస్థకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి. వినియోగదారుల సమీక్షలను కోరే ఉత్పత్తుల సరఫరాదారులు,  సరఫరాదారు లేదా స్వతంత్ర థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు పొందిన వారికి కూడా ఇవి అమలు కానున్నాయి. ఈ నిబంధనలను సంస్థలు పాటిస్తున్నాయో లేదో తనిఖీ చేసేందుకు వచ్చే 15 రోజుల్లో బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియ తీసుకురానుంది. బీఐఎస్‌తో ఈ ప్రమాణాల సర్టిఫికేషన్‌కు ఇ-కామర్స్‌ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ సమీక్షలకు ప్రమాణాలు రూపొందించిన మొదటి దేశం మనదే కావొచ్చని, చాలా ఇతర దేశాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని సింగ్‌ అన్నారు.

నకిలీ స్టార్‌ రేటింగ్‌లతో తప్పుదోవ

అనైతిక వ్యాపార పద్ధతుల కట్టడికి వినియోగదారు భద్రతా చట్టంలో నిబంధనలు ఉన్నాయని సింగ్‌ అన్నారు. ఆన్‌లైన్‌ ఉత్పత్తులు, సేవల కొనుగోలు సమయంలో నకిలీ సమీక్షలు, స్టార్‌ రేటింగ్‌లు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు.

ఈ సంస్థలు పాటిస్తాయ్‌

జొమాటో, స్విగ్గీ, రిలయన్స్‌ రిటైల్‌, టాటా సన్స్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, గూగుల్‌, మెటా, మీషో, బ్లింకిట్‌, జెప్టో సంస్థలతో ఈ ప్రమాణాలపై చర్చలు జరిపామని, నిబంధనలు పాటిస్తామని అవి హామీ ఇచ్చాయని తెలిపారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌, నాస్‌కామ్‌, ఆస్కీ, ఎన్‌ఆర్‌ఏఐ, కాయిట్‌ వంటి పరిశ్రమ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు జరిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని