2047కు 40 లక్షల కోట్ల డాలర్లకు

2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, 13 రెట్లు పెరిగి 40 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.3,264 లక్షల కోట్ల) స్థాయికి వృద్ధి చెందొచ్చని రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ అంచనా వేశారు.

Published : 23 Nov 2022 02:26 IST

ప్రస్తుతం కంటే 13 రెట్లు అధికం
భారత ఆర్థిక వ్యవస్థపై రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ

గాంధీనగర్‌: 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, 13 రెట్లు పెరిగి 40 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.3,264 లక్షల కోట్ల) స్థాయికి వృద్ధి చెందొచ్చని రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ అంచనా వేశారు. శుద్ధ ఇంధన విప్లవం, డిజిటలీకరణ ఇందుకు తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.245 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థతో  ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. 2047 కల్లా భారత్‌ అగ్రగామి మూడు దేశాల్లోకి వెళ్తుందని అంబానీ అన్నారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. 2047లో భారత్‌ 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని, ఇప్పటి నుంచి భవిష్యత్తును ‘అమృత కాలం’గా ముకేశ్‌ అంబానీ అభివర్ణించారు. శుద్ధ ఇంధన విప్లవం, బయో-ఇంధన విప్లవం, డిజిటల్‌ విప్లవం.. భారత్‌ను వృద్ధి పరంగా దశాబ్దాల ముందుకు తీసుకెళ్లాయని అభిప్రాయపడ్డారు. గొప్ప లక్ష్యాల దిశగా ఆలోచించడం, పర్యావరణహితం, డిజిలీకరణ విజయానికి మూడు మంత్రాలని విద్యార్థులకు సూచించారు. వినియోగం, సామాజిక- ఆర్థిక సంస్కరణలతో 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని ఇటీవల ఆసియా సంపన్నుడు గౌతమ్‌ అదానీ అంచనా వేశారు.

చంద్రశేఖరన్‌కు ప్రశంసలు: టాటా గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ను ముకేశ్‌ అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు. గత కొన్నేళ్లలో టాటా గ్రూప్‌ గణనీయ వృద్ధి సాధించడంలో చంద్రశేఖరన్‌ కీలక పాత్ర పోషించారని,  ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్‌ పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకెళ్తున్న తీరు స్ఫూర్తిదాయ కమని అన్నారు. వ్యాపార సమూహానికి, భారత యువతకు నిజమైన స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. చంద్రశేఖరన్‌ ముందుచూపు, నిర్ణయాలు, అనుభవంతో టాటా గ్రూప్‌ చరిత్ర సృష్టిస్తోందని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు