అపోలో డయాగ్నొస్టిక్స్‌ సేవల భారీ విస్తరణ

డయాగ్నొస్టిక్స్‌ సేవల విభాగాన్ని పెద్దఎత్తున విస్తరించేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఈ విభాగం నుంచి మూడేళ్లలో  రూ.1,000 కోట్ల ఆదాయం నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Published : 24 Nov 2022 06:10 IST

మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: డయాగ్నొస్టిక్స్‌ సేవల విభాగాన్ని పెద్దఎత్తున విస్తరించేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఈ విభాగం నుంచి మూడేళ్లలో   రూ.1,000 కోట్ల ఆదాయం నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సాధారణ రోగ నిర్ధరణ పరీక్షలే కాకుండా, అత్యాధునిక, సంక్లిష్ట వైద్య పరీక్షలూ నిర్వహించే సామర్థ్యం, సదుపాయాలు సమకూర్చుకోవాలని భావిస్తోంది.

3 విభాగాలుగా

అపోలో హాస్పిటల్స్‌కు 3 ప్రధాన వ్యాపార విభాగాలున్నాయి. అందులో ఎంతో ముఖ్యమైన వైద్య సేవలను అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఈఎల్‌) నిర్వహిస్తోంది. దీని అనుబంధ సంస్థ అయిన అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌ఎల్‌) కింద ప్రైమరీ క్లినిక్స్‌, డయాగ్నొస్టిక్స్‌ ల్యాబ్స్‌, డేకేర్‌ సేవలున్నాయి. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ (అపోలో 24/7), ఫార్మసీ సేవలు.. అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌) కింద ఉన్నాయి.

సెప్టెంబరు త్రైమాసికంలో రూ.100 కోట్లు

సెప్టెంబరు త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూపు ఆదాయాలు, 2021-22 ఇదేకాలంతో పోల్చినప్పుడు 14 శాతం వృద్ధితో    రూ.4,251 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో వైద్య సేవల వాటా 53 శాతమైతే, డయాగ్నొస్టిక్స్‌, ప్రైమరీ క్లినిక్స్‌, డేకేర్‌ సేవల వాటా 7 శాతమే. మిగిలిన వాటా అపోలో 24/7, ఫార్మసీ విభాగాల నుంచి లభించింది. డయాగ్నొస్టిక్స్‌ సేవల విభాగ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.100 కోట్లను అధిగమించడం ప్రత్యేకత. ఈ విభాగంలో ఇంకా విస్తరించి, ఆదాయాలు పెంచుకోవాలని అపోలో యాజమాన్యం ప్రయత్నాలు చేపట్టింది. దీని కోసం డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాల నెట్‌వర్క్‌ను పెంచుకుంటోంది.

2000 కేంద్రాలకు చేరితే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 260 కలెక్షన్‌ కేంద్రాలను, 9 థర్డ్‌ పార్టీ ల్యాబ్‌లను తన నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 నగరాలు/ పట్టణాల్లో 1500 కేంద్రాల నెట్‌వర్క్‌ అపోలో చేతిలో ఉంది. రోజుకు 13,000 మందికి పైగా వినియోగదార్లు అపోలో డయాగ్నొస్టిక్స్‌ సేవలను తీసుకుంటున్నారు. వచ్చే 6 - 8 నెలల్లో డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాల నెట్‌వర్క్‌ను 2,000 కేంద్రాలకు పెంచుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అపోలో డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఉన్నాయి. మున్ముందు పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త కేంద్రాలను ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇందులో భాగంగా ముంబయి, దిల్లీల్లో ఇటీవల నూతన కేంద్రాలను ప్రారంభించారు. డయాగ్నొస్టిక్స్‌ సేవల విభాగంలో ఇప్పటికే ఉన్న జాతీయ, ప్రాంతీయ స్థాయి సంస్థలకు తోడు కొత్తగా రిలయన్స్‌, అదానీ వంటి దిగ్గజ సంస్థలు అడుగు పెట్టే ఆలోచనలు చేస్తున్నందున, భవిష్యత్తులో పోటీ ఎంతో పెరగనుంది. అందువల్ల విస్తరణ ద్వారా ఈ విభాగంలో తన స్థానాన్ని పదిలపరుచుకునే యత్నాల్లో అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు నిమగ్నమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని