సంక్షిప్త వార్తలు(5)

హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజినీరింగ్‌, తొలి సారిగా నేషనల్‌ ఏరోస్పేస్‌ స్టాండర్డ్‌ (ఎన్‌ఏఎస్‌) విడిభాగాలను బోయింగ్‌కు అందజేసింది.

Updated : 25 Nov 2022 04:26 IST

బోయింగ్‌కు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ నుంచి విడిభాగాల సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజినీరింగ్‌, తొలి సారిగా నేషనల్‌ ఏరోస్పేస్‌ స్టాండర్డ్‌ (ఎన్‌ఏఎస్‌) విడిభాగాలను బోయింగ్‌కు అందజేసింది. ఈ కాంట్రాక్టును  గత ఏడాది సెప్టెంబరులో సంస్థ దక్కించుకుంది. తమకు కావాల్సిన ఉత్పత్తులను రికార్డు సమయంలో ఆజాద్‌ ఇంజినీరింగ్‌ అందించిందని బోయింగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ (సప్లై చైన్‌) అశ్వనీ భార్గవ పేర్కొన్నారు. ఖచ్చిత ప్రణాళిక, కఠిన ప్రమాణాలను అనుసరించడం ద్వారా దీన్ని సాధించామని ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ఎండీ రాకేష్‌ చోప్దార్‌ తెలిపారు. విమానాల్లో వినియోగించే టర్బైన్‌ బ్లేడ్ల తయారీ కోసం ప్రత్యేకంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ఏర్పాటు చేసింది.


హైదరాబాద్‌లో ఫెనెస్టా నూతన అల్యూమినియం ఫ్యాక్టరీ  

ఈనాడు, హైదరాబాద్‌: కిటికీలు, తలుపులు అందించే ఫెనెస్టా బిల్డింగ్‌ సిస్టమ్స్‌ (ఫెనెస్టా) హైదరాబాద్‌లో నూతన అల్యూమినియం ఫ్యాక్టరీని ప్రారంబించింది. కంపెనీకి ఇది ఏడో యూనిట్‌. ఇప్పటికే ఈ సంస్థకు కోట, భివాండీ, చెన్నై, భువనేశ్వర్‌ నగరాల్లో ఫ్యాక్టరీలున్నాయి. అల్యూమినియం కిటికీలు, తలుపులకు డిమాండ్‌ పెరుగుతున్నందున, కొత్త ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ఫెనెస్టా బిజినెస్‌ హెడ్‌ సాకేత్‌ జైన్‌ పేర్కొన్నారు. ఫెనెస్టా, దాదాపు రూ.9,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ గల డీసీఎం శ్రీరామ్‌ గ్రూపునకు చెందిన బిల్డింగ్‌ ఉత్పత్తుల విభాగం. యూపీవీసీ, అల్యూమినియం కిటికీలు, తలుపులను ఈ సంస్థ ఎంతోకాలంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 270 మంది డీలర్లు ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.


టాటాల చేతికి బిస్లరీ!

దిల్లీ: ప్యాకేజ్డ్‌ తాగునీటి వ్యాపార సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించేందుకు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (టీసీపీఎల్‌) సహా పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు. బిస్లరీని రూ.7,000 కోట్లకు టీసీపీఎల్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ‘మేం బిస్లరీని విక్రయించాలని అనుకుంటున్న మాట వాస్తవం. ఇందుకోసం ఆసక్తిగల కొనుగోలుదార్ల కోసం అన్వేషిస్తున్నాం. కొన్ని సంస్థలతో చర్చలూ జరుపుతున్నామ’ని చౌహాన్‌ తెలిపారు. బిస్లరీని ఎందుకు విక్రయించనున్నారనే ప్రశ్నకు చౌహాన్‌ స్పందిస్తూ.. ‘మా అమ్మాయి జయంతికి ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆసక్తి లేద’ని అన్నారు.  వ్యాపార విస్తరణ, వృద్ధి కోసం బిస్లరీ ఇంటర్నేషనల్‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నామని ఎక్స్ఛేంజీలకు టాటా గ్రూపు తెలియజేసింది.  


లారస్‌ ల్యాబ్స్‌కు ఎథాన్‌ ఎనర్జీలో 26 % వాటా  

ఈనాడు, హైదరాబాద్‌: సొంత విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని లారస్‌ ల్యాబ్స్‌, సౌర విద్యుదుత్పత్తి సంస్థ ఎథాన్‌ ఎనర్జీ ఇండియాలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.42.70 చొప్పున ధర చెల్లించే ఒప్పందం ప్రకారం 7,40,000 షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. దీనివల్ల ఎథాన్‌ ఎనర్జీకి చెందిన 10 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు నుంచి విద్యుత్తు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని లారస్‌ ల్యాబ్స్‌ పేర్కొంది.


ఎలీ లిల్లీ నుంచి రొమ్ము కేన్సర్‌ వ్యాధి ఔషధం  

దిల్లీ: ప్రముఖ విదేశీ ఔషధ సంస్థ ఎలీ లిల్లీ, రొమ్ము కేన్సర్‌ ఔషధాన్ని మనదేశంలో విడుదల చేసింది. ‘రామివెన్‌’ అనే ఈ ఔషధాన్ని 50, 100, 150, 200 ఎంజీ డోసుల్లో దేశీయ మార్కెట్‌కు అందిస్తున్నట్లు ఎలీ లిల్లీ వెల్లడించింది. ఎర్లీ స్టేజ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ (ఈబీసీ) బాధితులకు ఈ మందు అనువైదనిగా కంపెనీ పేర్కొంది. మనదేశంలో ఏటా దాదాపు 50,000 మందికి ఈబీసీ వ్యాధి వస్తున్నట్లు, ఇటువంటి వారికి ఈ ఔషధం భవిష్యత్తుపై భరోసా ఇస్తుందని వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని