ఆతిథ్య రంగంలో జోష్‌

కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆతిథ్య పరిశ్రమ ఆదాయం 23 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 25 Nov 2022 03:43 IST

కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఆదాయంలో 23% వృద్ధి
వ్యాపార పర్యటనలు పెరగడం వల్లే
క్రిసిల్‌ నివేదిక

ముంబయి: కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆతిథ్య పరిశ్రమ ఆదాయం 23 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ నివేదిక అంచనా వేసింది. వ్యాపార ప్రయాణాలు, ఉల్లాస పర్యటనలు పెరగడం ఇందుకు కారణంగా వివరించింది. సగటు గది అద్దెతో పాటు గదుల భర్తీ పెరగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత సుమారు 34 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. కొవిడ్‌-19 ముందు ఆర్థిక సంవత్సరం(2019-20)లో లాభదాయకత 24 శాతమని తన నివేదికలో వివరించింది. ‘కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ దశ ముగిసిన అనంతరం, ఉల్లాస పర్యటనలు పెరిగాయి. 2022 జనవరిలో ఒమిక్రాన్‌ దశ తర్వాత వ్యాపార ప్రయాణాలూ క్రమక్రమంగా పెరగడం ప్రారంభమైంది. ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, కార్యక్రమాలు) విభాగంలో గిరాకీ పెరగడం ఇందుకు దోహదం చేసింద’ని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ మోహిత్‌ మఖిజా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో అంతర్జాతీయంగా వ్యాపార పర్యటనల్లో పురోగతి.. దేశీయ ఆతిథ్య పరిశ్రమ పనితీరును బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో గదుల భర్తీ 73 శాతానికి పెరగొచ్చని తెలిపారు. 2019-20లో ఇది 68 శాతంగా ఉంది. సగటు గది అద్దె (ఏఆర్‌ఆర్‌) కూడా 8-10 శాతం పెరుగుతుందని చెప్పారు. గిరాకీ, సరఫరా మధ్య వ్యత్యాసం కూడా ఏఆర్‌ఆర్‌ మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts