కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్‌, నిఫ్టీ

కొనుగోళ్ల జోరుతో సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌, చమురు షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.

Published : 25 Nov 2022 03:54 IST

కొనుగోళ్ల జోరుతో సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌, చమురు షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నెమ్మదించొచ్చన్న అంచనాల వల్ల అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారడం ఇందుకు ప్రధాన కారణం. రూపాయి 23 పైసలు బలపడి 81.70 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర  0.46% తగ్గి 85.02 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.283.70 లక్షల కోట్లకు చేరింది. ఇది మాత్రం జీవనకాల గరిష్ఠం కాదు.

సెన్సెక్స్‌ ఉదయం 61,656 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 62,412.33 పాయింట్ల వద్ద జీవనకాల సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. చివరకు   762.10 పాయింట్ల లాభంతో 62,272.68 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 216.85 పాయింట్లు పెరిగి 18,484.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,529.70 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1167 పాయింట్లు, నిఫ్టీ 324 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

కీస్టోన్‌ రియల్టర్స్‌ షేరు ఇష్యూ ధర రూ.541తో పోలిస్తే బీఎస్‌ఈలో 2.58 శాతం లాభంతో రూ.555 వద్ద నమోదైంది. చివరకు 3.10 శాతం లాభంతో రూ.557.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,352.08 కోట్లుగా ఉంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 పరుగులు తీశాయి. ఇన్ఫోసిస్‌ 2.93%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.59%, పవర్‌గ్రిడ్‌ 2.56%, విప్రో 2.43%, టెక్‌ మహీంద్రా 2.39%, టీసీఎస్‌ 2.06%, హెచ్‌డీఎఫ్‌సీ 1.99% రాణించాయి. కోటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ స్వల్పంగా నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఐటీ 2.30%, టెక్‌  2.12%, చమురు-గ్యాస్‌ 1.25%, ఆర్థిక సేవలు   1.03%, యంత్ర పరికరాలు 0.98%, ఇంధన 0.92%, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.85% పెరిగాయి.  

మార్కెట్ల దూకుడుకు..

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గత సమావేశ నిర్ణయాలు బుధవారం విడుదలయ్యాయి. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని ఫెడ్‌ తగ్గించొచ్చన్న సంకేతాలు కనిపించడం, వర్థమాన దేశాల స్టాక్‌ మార్కెట్లకు  సానుకూలంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లూ పరుగులు తీశాయి. జపాన్‌ నిక్కీ, కొరియా కోస్పితో పాటు ఐరోపా సూచీలు రాణించాయి.

ముడిచమురు ధరలు తగ్గడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. అమెరికాలో చమురు నిల్వలు పెరగడం, రష్యా చమురుపై ధరల పరిమితి విధించొచ్చన్న అంచనాలు దోహదపడ్డాయి.

దేశీయంగా నవంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి.

గ్రీన్‌బాండ్లకూ అనుమతి: మున్సిపల్‌ రుణ సెక్యూరిటీలు జారీ చేసే సంస్థలు, గ్రీన్‌ బాండ్లను సైతం జారీ చేయొచ్చని సెబీ పేర్కొంది. ఇందుకు నాన్‌-కన్వెర్టబుల్‌ సెక్యూరిటీల నమోదు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.  

రూ.400 కోట్ల అదనపు ఆదాయం: పన్ను చెల్లింపుదార్లు ఆదాయపు పన్ను రిటర్న్‌(ఐటీఆర్‌)లను సవరించుకునే అవకాశం కల్పించడంతో.. ఇప్పటి వరకు 5 లక్షల రీ-ఫైలింగ్‌లు జరిగాయని, దాదాపు రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

నిరుద్యోగం తగ్గింది: ఈ ఏడాది జులై- సెప్టెంబరులో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 12 త్రైమాసికాల కనిష్ఠమైన 7.2 శాతానికి పరిమితమైందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా ఉంది. 15 ఏళ్లు పైబడిన వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని, ఈ అంచనాలు వెలువరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts