డాక్టర్‌ కోహ్లి అడుగుజాడల్లో ఐటీలో అగ్రస్థానానికి

మానవాళిని వణికించిన కొవిడ్‌ మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది.

Published : 26 Nov 2022 03:10 IST

నేడు వర్థంతి

మానవాళిని వణికించిన కొవిడ్‌ మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో, తరవాత కూడా జీవనం సాగించడానికి, కార్యాలయ-వ్యాపార-విద్యా కార్యకలాపాల నిర్వహణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంతో దోహదపడుతోంది. నాస్‌కామ్‌ ప్రకారం 200 బిలియన్‌ డాలర్ల ఆదాయం కలిగిన దేశీయ ఐటీ రంగం, 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) బృహత్తర పాత్ర పోషించడమే కాక 25 బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాలతో, 6 లక్షల మందికి పైగా ఉద్యోగులతో, ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్లలో రెండో ర్యాంకుతో అగ్రగామి సంస్థగా ఆవిర్భవించింది. ఈ సందర్భంలో భారత ఐటీ రంగ పితామహుడు, టీసీఎస్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓగా వ్యవహరించిన డాక్టర్‌ ఎఫ్‌.సి.కోహ్లిని స్మరించుకోకుండా ఉండలేం. ఆయన దార్శనికతే ఈ రోజు మనదేశాన్ని ఐటీ రంగంలో అగ్రభాగాన నిలబెట్టింది. టీసీఎస్‌ రూపుదిద్దుకోడానికి ఆయనే కారణం. సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన ఆయన.. ఇప్పుడు ఉంటే తన నమ్మకం గెలిచినందుకు ఎంతగానో సంతోషించి ఉండేవారు.

4 దశాబ్దాల క్రితమే గుర్తించి

మనదేశంలోని మానవ వనరుల సామర్థ్యంపై కోహ్లికి ఎంతగానో విశ్వాసం ఉండేది. నాస్‌కామ్‌, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) వంటి సంస్థలను డాక్టర్‌ కోహ్లి ఎంతో సమర్థించారు. ఐటీ రంగం మనదేశానికి గొప్ప అవకాశమని ఆయన నాలుగు దశాబ్దాల క్రితమే గుర్తించారు. అహ్మదాబాద్‌లో 1975లో జరిగిన సీఎస్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్నో ఏళ్ల క్రితం మనం పారిశ్రామిక విప్లవాన్ని అందుకోలేకపోయాం. ఇప్పుడు అటువంటి కొత్త విప్లవం  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూపంలో కనిపిస్తోంది. దీనికి యంత్రాలు, యంత్ర పరిజ్ఞానం అవసరం లేదు,  తార్కిక జ్ఞానం ఉంటే చాలు. అది భారతీయులకు ఎంతో ఉంది’ అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఐటీ రంగాన్ని అందిపుచ్చుకున్న మనదేశం, ఈరోజు ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించగలుగుతోంది.

కృత్రిమ మేధకు ఆనాడే బీజం

ఈ రోజు కృత్రిమ మేధ (ఏఐ) గురించి ఎంతో మంది మాట్లాడుతున్నారు. కానీ డాక్టర్‌ కోహ్లి ఎన్నో ఏళ్ల క్రితమే దీన్ని ప్రాధాన్యాన్ని గుర్తించారు. టీసీఎస్‌లోని పరిశోధనా విభాగమైన టాటా రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌ (టీఆర్‌డీడీసీ) లో 90వ దశకంలో ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో ఏఐ, నాలెడ్జి బేస్డ్‌ సిస్టమ్స్‌ ప్రస్తావన ఉంది. అప్పట్లో ఇంజినీరింగ్‌ డిగ్రీలో కృత్రిమ మేధ ఐచ్ఛికంగా ఉండగా, తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఆయన సూచించారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కొన్ని యూనివర్సిటీల పాలకవర్గాలతో మాట్లాడి, ఒప్పించారు కూడా. టీసీఎస్‌ మద్దతుతో హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో కోహ్లి సెంటర్‌ ఆన్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి ప్రదాత ఆయనేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చైనా, తైవాన్‌ స్ఫూర్తితో

ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌, తయారీ రంగాల్లో  చైనా, తైవాన్‌ సాధిస్తున్న విజయాలను డాక్టర్‌ కోహ్లి ఆసక్తిగా గమనించేవారు. తరచూ ఆ దేశాలను సందర్శించేవారు. అక్కడి అత్యుత్తమ తయారీ విధానాలను అనుసరించి, ముందుకు సాగితే, మనదేశమూ ప్రగతి సాధిస్తుందని కోహ్లి పేర్కొనేవారు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ, ఆయనకు అవసరమైన నోట్స్‌ రాస్తూ, ఆయన నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం కలిగిన కొద్ది మందిలో నేను ఒకరిని. ఒకసారి తైవాన్‌ వెళ్లినప్పుడు, గ్రేటర్‌ చైనా రీజియన్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన డాక్టర్‌ కె.టి.లీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, తైవాన్‌ హెడ్‌ డాక్టర్‌ ఎఫ్‌.సి.లిన్‌ లను కలవడమే కాక, వారిని మనదేశానికి ఆహ్వానించారు. ఎయిర్‌ ఇండియా భవనంలో వారికి డాక్టర్‌ కోహ్లి ప్రత్యేక ఆతిథ్యాన్ని ఇచ్చారు. ‘టీసీఎస్‌లో నాకు భారతీయత, ఆత్మగౌరవం, హుందాతనం కనిపించాయి’ అని డాక్టర్‌ లిన్‌ పేర్కొనడం నాకు ఇప్పటికీ గుర్తే.

తరచుగా హైదరాబాద్‌ వస్తూ

డాక్టర్‌ కోహ్లి తరచుగా హైదరాబాద్‌ వచ్చేవారు. టీసీఎస్‌ ప్రాంగణాన్ని సందర్శించకుండా తిరిగి వెళ్లడం అనేది ఉండదు. ఇక్కడి యువ ఉద్యోగులతో కలివిడిగా మాట్లాడుతూ, వారి ఆలోచనలకు, తన అనుభవాన్ని జోడించి, విశ్లేషణలు చేసేవారు. కొన్నేళ్ల క్రితం హైసియా ఆయనకు లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు అందించింది. డాక్టర్‌ కోహ్లి ముందుచూపు, పట్టుదలను అందిపుచ్చుకుని వేగంగా ముందడుగు వేయడమే మన ఐటీ పరిశ్రమ లక్ష్యం కావాలి. అదే డాక్టర్‌ కోహ్లికి మనమిచ్చే ఘన నివాళి.

- వి.రాజన్న (సీనియర్‌ ఉపాధ్యక్షుడు, గ్లోబల్‌ హెడ్‌- టెక్నాలజీ బిజినెస్‌, టీసీఎస్‌)

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని