2047 నాటికి అందరికీ బీమా

దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది.

Updated : 26 Nov 2022 08:12 IST

ఐఆర్‌డీఏఐ దిశా నిర్దేశం
నూతన సంస్కరణలకు శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌:  దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది. ఇందుకోసం వినూత్న సంస్కరణలు ప్రతిపాదిస్తూ, ఒక విధాన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఐఆర్‌డీఏఐ 120వ బోర్డు సమావేశంలో ఆవిష్కరించింది. బీమా కంపెనీలు, వినియోగదార్లు, పంపిణీదార్ల అవసరాలను గుర్తించి, పరిష్కరించడం.. బీమా రంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన అంశంగా ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ‘వినియోగదార్ల అవసరాలకు అనువైన పాలసీలను బీమా కంపెనీలు ఆవిష్కరించాలి. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనువైన వ్యవస్థ ఉండాలి. బీమా కంపెనీలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితులు కల్పించాలి. మార్కెట్‌ అవసరాల ప్రకారం బీమా నియంత్రణ వ్యవహారాలు ఉండాలి. బీమా రంగంలో కొత్తదనానికి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాల’ని నిర్ణయించింది.

ముఖ్య నిర్ణయాలు

* ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఎస్‌పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ద్వారా రావాల్సిన అవసరం లేదు.
*ఇకపై సబ్సిడరీ కంపెనీలూ బీమా కంపెనీల ప్రమోటర్లుగా ఉండొచ్చు.
* ఒక వ్యక్తి బీమా కంపెనీల్లో 25 శాతం వరకు వాటా సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 10 శాతమే.
* బీమా కంపెనీలో ప్రమోటర్లు తమ వాటాను 25% వరకు తగ్గించుకోవచ్చు
* బీమా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా.. కార్పొరేట్‌ ఏజెంట్లు (సీఏ), ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ సంస్థలు (ఐఎంఎఫ్‌) ఇకపై ఎక్కువ బీమా కంపెనీలు పాలసీలు విక్రయించవచ్చు. ప్రస్తుత కార్పొరేట్‌ ఏజెంట్లు 3 బీమా కంపెనీలు, ఐఎంఎఫ్‌లు 2 బీమా కంపెనీల పాలసీలే విక్రయించే వీలుంది. ఇకపై కార్పొరేట్‌ ఏజెంట్లు 9 కంపెనీలు, ఐఎంఎఫ్‌లు 6 కంపెనీల పాలసీలు విక్రయించే అవకాశం కల్పించనున్నారు.
* ముందస్తు అనుమతి తీసుకోకుండానే విభిన్న బీమా పాలసీలను ఆవిష్కరించే అవకాశాన్ని బీమా కంపెనీలకు కల్పిస్తారు. దీనివల్ల మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పాలసీలను తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది.
* కొత్త మార్గాల్లో మూలధనం సమకూర్చుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకు కల్పిస్తారు.
* ‘యాక్చువరీ’ల కొరతను అధిగమించడానికి వారి అనుభవం, అర్హత నిబంధనలను సడలిస్తారు.
* బీమా కంపెనీలకు ‘సాల్వెన్సీ’ నిబంధనలను సులభతరం చేయాలని ప్రతిపాదించారు.

బీమా కంపెనీల ఐపీఓకు పచ్చ జెండా

గో-డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కు తుది అనుమతిని, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓకు ప్రాథ]మిక అనుమతిని ఐఆర్‌డీఏఐ  ఇచ్చింది. ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విలీనానికి ఆమోదం తెలిపింది. క్షేమ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను ఆమోదించింది.

ఎంతో స్ఫూర్తి దాయకం

‘‘చరిత్రాత్మకమైన సంస్కరణల దిశగా బీమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఆర్‌డీఏఐ ప్రయత్నిస్తోంది. వ్యాపార కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేయటం, పంపిణీ విధానాలను సరళీకరించటం, వినియోగదారుడు కేంద్రంగా కొత్త ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావటం... వంటి విధానాలతో బీమా రంగం పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షిస్తుంది. ఎన్నో సమస్యలకు ఐఆర్‌డీఏఐ ఏకకాలంలో పరిష్కారాన్ని చూపింది. ‘అందరికీ బీమా’ అనేది ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ లక్ష్యాన్ని సాధించటానికి ప్రస్తుత సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయి.’’

- భార్గవ్‌ దాస్‌గుప్తా, ఎండీ&సీఈవో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జీఐసి లిమిటెడ్‌.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు