స్వల్ప లాభాలతో సరి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, మారుతీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండో రోజూ సూచీల రికార్డుల జోరు కొనసాగింది.

Updated : 26 Nov 2022 04:54 IST

సమీక్ష

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, మారుతీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండో రోజూ సూచీల రికార్డుల జోరు కొనసాగింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.71 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.21 శాతం లాభంతో 86.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 1140 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, హాంకాంగ్‌ నష్టపోగా.. షాంఘై లాభపడింది. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
సెన్సెక్స్‌ ఉదయం 62,327.88 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. 62,447.73 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అనంతరం లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చిన సెన్సెక్స్‌, 20.96 పాయింట్ల అతిస్వల్ప లాభంతో 62,293.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.65 పాయింట్లు పెరిగి 18,512.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,445.10- 18,534.90 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. రిలయన్స్‌ 1.34%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.18%, విప్రో 1.16%, టెక్‌ మహీంద్రా 1.01%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.98%, మారుతీ 0.72%, టాటా స్టీల్‌ 0.71% చొప్పున రాణించాయి. నెస్లే 1.29%, కోటక్‌ బ్యాంక్‌ 0.95%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.94%, టైటన్‌ 0.58% నష్టపోయాయి.  
*   రెండో వారమూ ఫారెక్స్‌ నిల్వలు పెరిగాయ్‌: నవంబరు 18తో ముగిసిన వారానికి దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.54 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.22,000 కోట్లు) పెరిగి 547.25 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.44,90,000 కోట్ల)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఫారెక్స్‌ నిల్వల్లో అధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు 1.76 బిలియన్‌ డాలర్లు అధికమై 484.288 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
* ఇంజినీరింగ్‌ సిస్టమ్స్‌, సొల్యూషన్లు అందించే యునిపార్ట్స్‌ ఇండియా ఐపీఓ నవంబరు 30న ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.548- 577 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.836 కోట్లు సమీకరించనుంది.
* గుజరాత్‌ అంతా 5జీ సేవలు.. జియో: ప్రయోగాత్మక దశలో భాగంగా గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు ప్రారంభమైన తొలి రాష్ట్రంగా గుజరాత్‌ అవతరించింది.  
* వచ్చే సెప్టెంబరుకు హెచ్‌డీఎఫ్‌సీ విలీనం: మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనానికి మరో 8-10 నెలల సమయం పట్టొచ్చని, వచ్చే ఏడాది సెప్టెంబరుకు పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ శశిధరన్‌ జగదీశన్‌ తెలిపారు.
* ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) రూ.98 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) చేయనుంది. ఇందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. ‘బహిరంగ విపణి మార్గంలో రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.200 ధరకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు, రూ.98 కోట్లు వ్యయం చేయాలని బోర్డు నిర్ణయించింద’ని సంస్థ సమాచారం ఇచ్చింది. ఈ బైబ్యాక్‌లో గరిష్ఠంగా కొనుగోలు చేసే షేర్ల సంఖ్య 49 లక్షల వరకు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు