సంక్షిప్త వార్తలు (2)

లావాదేవీ ఖర్చులను నియంత్రించేందుకు రూపాయి, దిర్హామ్‌లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌, యూఏఈ కేంద్ర బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి.

Published : 26 Nov 2022 03:10 IST

రూపాయి, దిర్హామ్‌లలో వాణిజ్యం
భారత్‌, యూఏఈ చర్చలు

దిల్లీ: లావాదేవీ ఖర్చులను నియంత్రించేందుకు రూపాయి, దిర్హామ్‌లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌, యూఏఈ కేంద్ర బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యంపై ఒక చర్చాపత్రాన్ని భారత్‌ రూపొందించిందని యూఏఈలో భారత రాయబారి సుంజయ్‌ సుధీర్‌ పేర్కొన్నారు. 2023 మే 1 నుంచి ఇరు దేశాలు అమలు చేయనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వినియోగాన్ని ఈ చర్య విస్తృతం చేయగలదని భావిస్తున్నారు. ‘భారత్‌కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఎగుమతుల్లో రెండు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఇరు కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తే ఈ స్థానాలు మరింత మెరుగుపడతాయ’ని ఆయన అన్నారు. సెప్టెంబరులో ఈ అంశంపై తొలిసారిగా చర్చలు జరిగాయని రాయబారి పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో దేశీయ కరెన్సీపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో భారత రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీల నిర్వహణకు అవసరమైన అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని జులైలో బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించిన సంగతి తెలిసిందే. యూపీఐ వ్యవస్థపై యూఏఈ చాలా ఆసక్తి ప్రదర్శిస్తోందనీ సుధీర్‌ వెల్లడించారు. ప్రస్తుతానికి చర్చల ప్రక్రియలో ఉన్నట్లు వివరించారు.


సాంకేతిక సమస్యలు తలెత్తితే స్టాక్‌ బ్రోకర్లపై అపరాధ రుసుములు!

దిల్లీ: స్టాక్‌ బ్రోకర్లకు సంబంధించిన ట్రేడింగ్‌ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే.. వారిపై అపరాధ రుసుము విధించాల్సిందిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలను శుక్రవారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ట్రేడింగ్‌ వ్యవస్థల్లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే గంటలోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు స్టాక్‌ బ్రోకర్లు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరోజులోగా ప్రాథమిక నివేదికను సైతం సమర్పించాలని సెబీ పేర్కొంది. స్టాక్‌ బ్రోకర్ల ట్రేడింగ్‌ వ్యవస్థల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వివరాలను ఎక్స్ఛేంజీలు తమ వెబ్‌సైట్‌లలో ఉంచాలని, ఇటువంటి సమస్యలకు కారణాలను విశ్లేషించి, (ఆర్‌సీఏ) ఆ వివరాలను అందించాలని వెల్లడించింది. కొత్త నియామవళి 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని