దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖచిత్రమే ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గతంలో ఎన్నడూ లేనంతగా రూ.13,265 కోట్ల నికర లాభాన్ని సెప్టెంబరు త్రైమాసికంలో ప్రకటించి విశ్లేషకులు, బ్రోకింగ్‌ సంస్థల  ప్రశంసలు అందుకుందని ఆ బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా శనివారం వెల్లడించారు.

Published : 27 Nov 2022 02:26 IST

అత్యధిక లాభంతో అందరి ప్రశంసలు
బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌

కోల్‌కతా: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గతంలో ఎన్నడూ లేనంతగా రూ.13,265 కోట్ల నికర లాభాన్ని సెప్టెంబరు త్రైమాసికంలో ప్రకటించి విశ్లేషకులు, బ్రోకింగ్‌ సంస్థల  ప్రశంసలు అందుకుందని ఆ బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా శనివారం వెల్లడించారు. 2021-22 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది ఏకంగా 74 శాతం అధికం. మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వంటి బ్రోకింగ్‌ సంస్థలు ఎస్‌బీఐ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయని దినేశ్‌ వెల్లడించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు ఎస్‌బీఐ ముఖ చిత్రంలా ఉంటుంది. బ్యాంక్‌కు 47 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. ప్రతి ఇంటికి మా బ్యాంక్‌తో ఏదో రకంగా సంబంధం ఉంది. పరిమాణం పరంగా ఇప్పటికే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌, 2027 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంద’ని దినేశ్‌ వివరించారు.

సేవలు మరింత మెరుగుపర్చాలి: ఖాతాదార్ల సేవలను, వారి అంచనాలకు అనుగుణంగా మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ పేర్కొన్నారు. ఖాతాదార్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకింగ్‌ అనేది ప్రస్తుతం విజ్ఞాన రంగంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖాతాదార్లకు తగ్గట్లుగా ఆఫర్లు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ బ్యాంక్‌ ఖాతాదార్లకు సేవలు కొనసాగాయని గుర్తు చేశారు. డిజిటల్‌కు మారడంలో ఖాతాదార్ల ప్రవర్తనలోనూ మార్పు వచ్చిందన్నారు. సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడంతో.. యోనో యాప్‌ ద్వారా కొత్త వ్యాపార సృష్టి జరిగిందని, ఎలాంటి ఆటంకాలు లేని సేవలు అందించగలిగామన్నారు. బ్యాంక్‌ శాఖల్ని కూడా సమయానికి తెరవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని