డాక్టర్‌ రెడ్డీస్‌లో నారీ శక్తి

మహిళా శక్తికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పెద్దపీట వేయనుంది. అన్ని స్థాయిల్లో మహిళా ఉద్యోగులను అధికంగా నియమించాలని.. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు సంస్థ సహ-ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ ‘డాక్టర్‌ రెడ్డీస్‌ సస్టెయినబిలిటీ రిపోర్ట్‌- 2022’ లో వెల్లడించారు.

Published : 27 Nov 2022 02:26 IST

నాయకత్వ స్థానాల్లో 2030 నాటికి 36% మంది మహిళలే

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా శక్తికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పెద్దపీట వేయనుంది. అన్ని స్థాయిల్లో మహిళా ఉద్యోగులను అధికంగా నియమించాలని.. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు సంస్థ సహ-ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ ‘డాక్టర్‌ రెడ్డీస్‌ సస్టెయినబిలిటీ రిపోర్ట్‌- 2022’ లో వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌లో మేనేజర్‌ స్థాయి ఉద్యోగాల్లో 12% మంది మహిళలున్నారు. దీన్ని 2030 నాటికి 36 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దివ్యాంగులకు సాధ్యమైనంత అధికంగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ‘వికలాంగులకు ఇకపై ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం, 2030 నాటికి మా సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 3% వారే ఉంటారు’ అని జీవీ ప్రసాద్‌ వివరించారు.

అమెరికా ఎగుమతులకు: 2027 నాటికి అమెరికా మార్కెట్లో విడుదల చేసే ఔషధాల్లో కనీసం 25 శాతం మందులు ‘ఫస్ట్‌-టు-మార్కెట్‌’ హోదా కలిగినవిగా ఉండాలని డాక్టర్‌ రెడ్డీస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందువల్ల తక్కువ ధరకు జనరిక్‌ ఔషధాలు విక్రయించే అవకాశం కలుగుతుంది. ఇదేకాకుండా ఏటా కనీసం మూడు కొత్త ఔషధాలు ఆవిష్కరించాలని సంస్థ భావిస్తోంది. 2030 నాటికి 150 కోట్ల మంది రోగులకు తన ఔషధాలను అందించాలనే లక్ష్యాన్ని ఈ సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌ మందులను దాదాపు 68 కోట్ల మంది వినియోగిస్తున్నారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే విధానాలను అనుసరించేందుకు ప్రయత్నించనున్నట్లు ఈ నివేదికలో డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపడం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయటం ముఖ్యాంశాలుగా వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని