సంక్షిప్త వార్తలు(3)

కరెన్సీ మారకపు విలువలు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టమని, అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కనుక వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిస్తే, భారత రూపాయి మారకపు విలువ స్థిరపడే అవకాశం ఉందని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అమెరికా ఆర్థికవేత్త డగ్లస్‌ డబ్ల్యూ.డైమండ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 28 Nov 2022 00:46 IST

పసిడి దిగుమతులు తగ్గాయ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరులో పసిడి దిగుమతులు 24 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.96 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. 2021-22 ఇదే కాల దిగుమతులు 29 బిలియన్‌ డాలర్ల (సుమారు   రూ.2.37 లక్షల కోట్ల)తో పోలిస్తే, ఇవి 17.38 శాతం తక్కువ. ఒక్క అక్టోబరులో చూస్తే   27.47 శాతం తక్కువగా 3.7 బి.డా. పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. ఏప్రిల్‌-అక్టోబరులో 4.8 బి.డా. వెండి దిగుమతి అయ్యింది. 2021-22 ఇదేకాలంలో వెండి దిగుమతుల విలువ 1.52 బి.డాలర్లే. ఒక్క అక్టోబరులో అయితే 34.80 శాతం తక్కువగా 585 మిలియన్‌ డాలర్ల వెండి దిగుమతి అయ్యింది.


వడ్డీ రేట్లపై ఫెడ్‌ నెమ్మదిస్తే రూపాయి స్థిరపడొచ్చు

ఎకనామిక్స్‌ నోబెల్‌ విజేత డగ్లస్‌

దిల్లీ: కరెన్సీ మారకపు విలువలు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టమని, అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కనుక వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిస్తే, భారత రూపాయి మారకపు విలువ స్థిరపడే అవకాశం ఉందని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అమెరికా ఆర్థికవేత్త డగ్లస్‌ డబ్ల్యూ.డైమండ్‌ అభిప్రాయపడ్డారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్‌ బెన్‌ బెర్నాంకే, అమెరికాకే చెందిన మరో ఆర్థికవేత్త ఫిలిప్‌ హెచ్‌ డిబ్విగ్‌లతో కలిసి నోబెల్‌ బహుమతిని డగ్లస్‌ పంచుకున్నారు.  

డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఇంకా పతనమవుతుండటంపై డైమండ్‌ మాట్లాడుతూ.. అమెరికా వడ్డీ రేట్లను పెంచినప్పుడల్లా, డాలర్‌ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఒకసారి వడ్డీ రేట్ల పెంపు నెమ్మదిస్తే రూపాయి విలువ స్థిరీకరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.'

నోబెల్‌ బహుమతి కింద సుమారు 9 లక్షల యూఎస్‌ డాలర్లు/రూ.7.3 కోట్లను విజేతలకు అందిస్తారు. డిసెంబరు 10న స్టాక్‌హోమ్‌, ఓస్లోలో ఈ బహుమతీ ప్రదానం ఉండనుంది.


రెండేళ్లలో హీరో-హార్లే బైక్‌

దిల్లీ: హీరో మోటోకార్ప్‌, హార్లే-డేవిడ్‌సన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న బైక్‌ రెండేళ్లలో మార్కెట్‌లోకి వస్తుందని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. ప్రీమియం బైక్‌ల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగానే హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి బైక్‌ను అభివృద్ధి చేసి విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ బైక్‌ల విభాగంలో (100-110సీసీ) నాయకత్వ హోదాలో ఉన్న హీరో మోటోకార్ప్‌ 160 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ విక్రయాల పరిమాణం, లాభదాయకతను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో ప్రీమియం విభాగంలో తాము తీసుకురాబోయే మోడళ్లు విక్రయ పరిమాణం, లాభదాయకతలో మార్పు తీసుకొస్తాయని, హార్లేతో కలిసి అభివృద్ధి చేస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఇందుకు ఉపకరిస్తుందని అనలిస్ట్‌ కాల్‌ సందర్భంగా గుప్తా వెల్లడించారు. మధ్య కాలానికి ప్రీమియం విభాగంలో మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు ఈ మోడల్‌ బైక్‌లు దోహదం చేస్తాయన్నారు. 2020 అక్టోబరులో హీరో మోటోకార్ప్‌, అమెరికా బ్రాండ్‌ హార్లే-డేవిడ్‌సన్‌లు భారతీయ విపణి కోసం భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి విదితమే.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు