స్వల్పకాలంలో మరింత పైకి

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. భవిష్యత్తు రేట్ల పెంపులో నెమ్మదించే అవకాశం ఉందని అమెరికా ఫెడ్‌ ప్రకటించడంతో, అంతర్జాతీయంగా మార్కెట్లకు పరిస్థితులు సానుకూలంగా మారాయి.

Published : 28 Nov 2022 00:48 IST

సమీక్ష: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. భవిష్యత్తు రేట్ల పెంపులో నెమ్మదించే అవకాశం ఉందని అమెరికా ఫెడ్‌ ప్రకటించడంతో, అంతర్జాతీయంగా మార్కెట్లకు పరిస్థితులు సానుకూలంగా మారాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 4.2 శాతం తగ్గి 83.6 డాలర్లకు చేరడం, దేశీయ సంస్థాగత మదుపుదార్ల (డీఐఐ) కొనుగోళ్లతో సెంటిమెంట్‌ సానుకూలంగానే కొనసాగింది. షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. నెలవారీ డెరివేటివ్‌ల ముగింపు గడువు నేపథ్యంలో ఒడుదొడుకులు కనిపించాయి. చైనాలో కొవిడ్‌ నిబంధనలపై ఆందోళనలు ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి  81.68 వద్ద మార్పులేకుండా ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. అక్టోబరు నెల ద్రవ్యోల్బణం జపాన్‌లో 40 ఏళ్ల గరిష్ఠమైన 3.6 శాతానికి, ఐరోపా సమాఖ్యలో 9.9 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1 శాతం లాభంతో 62,294 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.1 శాతం పెరిగి 18,513 పాయింట్ల దగ్గర స్థిరపడ్డాయి. ఐటీ, చమురు-గ్యాస్‌, వాహన షేర్లు లాభపడగా, విద్యుత్‌, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.1,246 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1,781 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నవంబరులో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) రూ.31,630 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:5గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ జీవనకాల గత గరిష్ఠ ముగింపు అయిన 62,245 పాయింట్ల పైకి చేరింది. ఇది సూచీ మరింత పైకి వెళ్లే అవకాశాలను సూచిస్తోంది. 61,440 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇది కోల్పోతే 60,850 వద్ద కీలక మద్దతు ఉంది. నిరోధం/లాభాల స్వీకరణకు ముందు మార్కెట్‌ మరింత పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

ప్రభావిత అంశాలు: మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు అంతర్జాతీయ మార్కెట్లు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల ఒడుదొడుకులు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ధోరణి నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ వారం వెలువడనున్న సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు, అక్టోబరు మౌలిక రంగ గణాంకాలను గమనించాలి. నవంబరు వాహన విక్రయాలు, పీఎంఐ తయారీ గణాంకాలూ ఈ వారంలోనే వెల్లడవుతాయి. సమీప కాలంలో షేరు/రంగం ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలూ కీలకం కానున్నాయి. ఈ వారంలో ధర్మాజ్‌ క్రాప్‌ గార్డ్‌, యూనిపార్ట్స్‌ ఇండియాలు రూ.1,100 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓలకు వస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే చైనాలో కొవిడ్‌ ఆంక్షలు, అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు మార్కెట్లలో ఒడుదొడుకులకు కారణం కావొచ్చు. యూఎస్‌ రిటైల్‌ విక్రయాల గణాంకాలు రానున్నాయి. తయారీ సూచీ, యూఎస్‌ వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాలు, ఐరోపా నవంబరు ద్రవ్యోల్బణం, జపాన్‌ వినియోగదారు విశ్వాస సూచీ గణాంకాలను పరిశీలించాలి.

తక్షణ మద్దతు స్థాయులు: 61,740; 61,442; 60,848

తక్షణ నిరోధ స్థాయులు: 62,600; 63,500; 64,000

సెన్సెక్స్‌ స్వల్పకాలంలో మరింత పైకి వెళ్లొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు