దివాలా స్మృతిలో రికవరీ తగ్గుతోంది

రుణాల్లో కూరుకుపోయిన కంపెనీల నుంచి దివాలా స్మృతి కింద వసూళ్లు సెప్టెంబరు త్రైమాసికం చివరకు 30.18 శాతానికి తగ్గిపోయాయి.

Published : 28 Nov 2022 00:53 IST

ముంబయి: రుణాల్లో కూరుకుపోయిన కంపెనీల నుంచి దివాలా స్మృతి కింద వసూళ్లు సెప్టెంబరు త్రైమాసికం చివరకు 30.18 శాతానికి తగ్గిపోయాయి. అంటే తాము ఇచ్చిన రుణాల్లో అధిక భాగాన్ని ఆర్థిక సంస్థలు వదిలేసుకుంటున్నట్లేనని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. 2019-20 తొలి త్రైమాసికంలో రికవరీ 43 శాతం కాగా, ఇప్పుడు ఇంతగా తగ్గిపోవడం గమనార్హం. 2021-22 నాలుగో త్రైమాసికం చివరకు రికవరీ రేటు 32.9 శాతం ఉండగా, ఇప్పుడు మరింత తగ్గింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు చెందిన వివిధ బెంచ్‌ల వద్దకు చేరిన కేసుల్లో రూ.7,90,626.2 కోట్ల రుణాలు వసూలు కావాల్సి ఉంది. ఇందులో సెప్టెంబరు త్రైమాసికం చివరకు     రూ.2,43,452.5 కోట్లు (30.18%) మాత్రమే రికవరీ అయ్యాయి. అంటే తాము ఇచ్చిన నిధుల్లో దాదాపు 70 శాతాన్ని ఆర్థిక సంస్థలు వదిలేసుకుంటున్నట్లే. 2020-21 రెండో అర్ధభాగం నుంచి ఎన్‌సీఎల్‌టీ వద్దకు చేరుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.

2016లో దివాలా స్మృతి ప్రక్రియ అమల్లోకి వచ్చినప్పటి నుంచి, 5,893 కంపెనీల రుణ కేసుల పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి చేరగా, 9 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. 31 శాతం కేసులు లిక్విడిటీకి చేరాయి. 14 శాతం కేసులు రివ్యూకు చేరగా, 11 శాతం ఉపసంహరించారు.

ఇందులో 3,008 కేసులను ఆపరేషనల్‌ క్రెడిటార్లు, 2,531 కేసులను ఆర్థిక రుణదాతలు దాఖలు చేశారు. కార్పొరేట్‌ రుణదాతలు వేసినవి 3 శాతంగా మాత్రమే ఉన్నాయి.

తయారీ రంగం నుంచి 39 శాతం కేసులు, స్థిరాస్తి నుంచి 21 శాతం, నిర్మాణ రంగం నుంచి 11 శాతం, ట్రేడింగ్‌ నుంచి 10 శాతం కేసులు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని