వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు రంగ బ్యాంకే

వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌ ‘భారతీయ ప్రైవేటు రంగ బ్యాంక్‌’గా కొనసాగుతుందని ఆర్థిక శాఖ ఆదివారం స్పష్టం చేసింది.

Published : 28 Nov 2022 00:54 IST

దిల్లీ: వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌ ‘భారతీయ ప్రైవేటు రంగ బ్యాంక్‌’గా కొనసాగుతుందని ఆర్థిక శాఖ ఆదివారం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంక్‌లో మిగిలిన 15 శాతం వాటాను పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. పొడిగించిన వ్యవధిలోపు కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ (ఎంపీఎస్‌) సాధించడానికి కొత్త యజమాని కోసం ‘సముచితమైన పంపిణీ’ పరిశీలనలో ఉందని పేర్కొంది. విజయవంతమైన బిడ్డర్‌కు ఐడీబీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థల కార్పొరేట్‌ పునర్నిర్మాణానికి ఎలాంటి పరిమితులు ఉండవని తెలిపింది. పెట్టుబడిదార్ల ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రశ్నలకు ప్రతిస్పందనగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) వివరణ ఇచ్చింది.

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం అక్టోబరు 7న బిడ్లు ఆహ్వానించిన సంగతి విదితమే. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)తో కలిసి ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాథమిక బిడ్లు లేదా ఆసక్తి వ్యక్తీకరణకు డిసెంబరు 16 వరకు గడువు ఇచ్చింది. వాస్తవానికి ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ, ప్రభుత్వానికి కలిపి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. విజయవంత బిడ్డర్‌.. మిగిలిన పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 5.28 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ వ్యూహాత్మక విక్రయ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్‌ఐసీకి 19 శాతం వాటాలుంటాయి. మొత్తం 34 శాతం వాటా ఉన్నా.. బోర్డు నిర్వహణలో అటు ప్రభుత్వం గానీ, ఇటు    ఎల్‌ఐసీ గానీ జోక్యం చేసుకోవని ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు