నిఫ్టీ కొత్త శిఖరాలకు..

భారత మార్కెట్లు మరింత స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం వెలువడే సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వివరాలు, గురువారం వెలువడే వాహన విక్రయ - తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు అమెరికా జీడీపీ, కార్మిక మార్కెట్‌ విశేషాలనూ గమనించాలి.

Published : 28 Nov 2022 00:57 IST

బ్యాంకింగ్‌, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు సానుకూలతలు
అంతర్జాతీయ, దేశీయ గణాంకాలు కీలకం
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

భారత మార్కెట్లు మరింత స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం వెలువడే సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వివరాలు, గురువారం వెలువడే వాహన విక్రయ - తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు అమెరికా జీడీపీ, కార్మిక మార్కెట్‌ విశేషాలనూ గమనించాలి. సానుకూల ధోరణి కొనసాగుతుందని.. నిఫ్టీ-50 సూచీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలకు చేరొచ్చని చెబుతున్నారు. నిఫ్టీ-50కి 18,600 వద్ద నిరోధం, 18,300 వద్ద మద్దతు లభించొచ్చంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, మదుపర్ల సెంటిమెంటుపై ప్రభావం చూపుతుంది. గత 5 వారాల్లో, నాలుగు వారాలు నిఫ్టీ మంచి లాభాలనే నమోదు చేసింది. అయితే మదుపర్లు ఎంపిక చేసిన రంగాలు, షేర్లపై దృష్టి సారించడం మేలని సూచిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

సిమెంటు కంపెనీల షేర్లు మార్కెట్‌తో పాటే కదలాడొచ్చు. డిసెంబరులో కంపెనీలు బస్తాకు రూ.25 చొప్పున ధరలు పెంచొచ్చన్న అంచనాలు నిజమైతే ఈ షేర్లు రాణించొచ్చు.

యంత్రపరికరాల షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. ఆర్డర్ల వార్తలు సానుకూలంగా ఉన్నందున పై స్థాయిలోనే చలించొచ్చు.

బ్యాంకింగ్‌ షేర్లు లాభాలను కొనసాగించొచ్చు. యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్క్రిప్‌లు రాణించడంతో నిఫ్టీ బ్యాంక్‌ గత వారం జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 43,339ని చేరింది. 43,500 వద్ద నిరోధం; 42,500 వద్ద మద్దతు కనిపించొచ్చని అంచనా.

సంవత్సరాంత పండగల గిరాకీ, కమొడిటీ ధరలు కిందకు దిగి రావడం వల్ల ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించొచ్చు. గ్రామీణ గిరాకీ పుంజుకోవచ్చన్న అంచనాలూ కలిసిరావొచ్చు.

మార్కెట్‌తో పాటే వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. నవంబరు అమ్మకాలు డిసెంబరు1న రానున్నాయి. చాలా వరకు వృద్ధినే నమోదు చేయనున్నాయని అంచనా. ప్రయాణికుల వాహనాలు ముందుండి నడిపించొచ్చు.

ప్రధాన వార్తలేమీ లేనందున   ఔషధ కంపెనీలు స్తబ్దుగానే కొనసాగొచ్చు. కొన్ని కంపెనీల షేరు ధరలు సహేతుకంగానే ఉన్నా.. నియంత్రణ పరమైన ఇబ్బందులు, కొత్త ఆవిష్కరణల్లో మందగమనం, పోటీ పెరగడం వంటి వాటి వల్ల మదుపర్లు వెనకడుగు వేయొచ్చు.

అంతర్జాతీయ బలహీనతలు కొనసాగుతుండడం, ఫెడ్‌ వైఖరిలో స్పష్టత రావడంతో దేశీయ లోహ కంపెనీల షేర్లలో తాజా కొనుగోళ్లకు ఆసక్తి ఉండకపోవచ్చు.

అప్‌స్ట్రీమ్‌ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా షేర్లు ముడి చమురు ధరల ఆధారంగా చలించొచ్చు. చైనా నుంచి తక్కువ గిరాకీ కారణంగా చమురు ధరలు తగ్గే అవకాశమే కనిపిస్తోంది.

ఎంపిక చేసిన టెలికాం షేర్లలో కదలికలు కొనసాగొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు రూ.820 దిశగా వస్తే కొనుగోళ్లు చేయవచ్చని.. రూ.860కి పైకి వెళ్లేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌ఐఎల్‌ను రూ.2700 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చంటున్నారు.

ఐటీ షేర్లు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ట్రేడవవచ్చు. ఐటీ రంగంలో 80% దిద్దుబాట్లు పూర్తయ్యాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, రేట్ల పెంపు విషయంలో ఇచ్చిన సంకేతాలు సానుకూలంగా పనిచేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని