‘రాకెట్‌ సిటీగా హైదరాబాద్.. విమాన టిక్కెట్‌ ధరలకే అంతరిక్ష ప్రయాణాలు’

రాకెట్ల తయారీలో హైదరాబాద్‌ కీలకంగా మారడంతో పాటు, రాకెట్‌ సిటీగా రూపొందుతోందని స్కైరూట్‌ సహ-వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన అన్నారు.

Updated : 29 Nov 2022 07:59 IST

స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాకెట్ల తయారీలో హైదరాబాద్‌ కీలకంగా మారడంతో పాటు, రాకెట్‌ సిటీగా రూపొందుతోందని స్కైరూట్‌ సహ-వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన అన్నారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ సోమవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతరిక్ష ప్రయోగాలు ఎంతో ఆసక్తికరమని, మన దేశానికి ఇది ఒక పెద్ద అవకాశమని పవన్‌ వివరించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ 500 కిలోల కంటే తక్కువ బరువుండే చిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాల సంఖ్య వచ్చే పదేళ్లలో అనూహ్యంగా పెరగనుందని పేర్కొన్నారు. వీటి సంఖ్య దాదాపు 40,000కు పెరుగుతుందని అంచనా ఉందన్నారు. అందువల్ల తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్లే అవకాశం ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటికే పశ్చిమ దేశాల్లో అంతరిక్ష ప్రయాణాలు జరుగుతున్నాయని, మన దేశంలో వచ్చే పదేళ్లలో ఇది సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విమాన టికెట్‌ ధరలోనే అంతరిక్ష ప్రయాణాలు చేసే రోజులు ఎంతో దూరంలో లేవని తెలిపారు.

విమానంలో పట్టే మందిని రాకెట్‌లో..: ప్రస్తుతం 10 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లు ఉన్నాయని, భవిష్యత్తులో ఒక విమానంలో పట్టే మందిని తీసుకెళ్లగలుగుతామని అంచనా వేశారు. విక్రాంత్‌-1 రాకెట్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నామని, వచ్చే ఏడాదిలో దీన్ని ప్రయోగించే అవకాశం ఉందన్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించేలా సాంకేతికత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అంతరిక్ష పరిశోధనలో కీలకంగా ఉన్నాయని, హైదరాబాద్‌ కేంద్రంగా స్కైరూట్‌తో పాటు, ధ్రువ స్పేస్‌, ఇతర సంస్థలూ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించగలరని తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో 10% మంది మహిళలే ఉన్నట్లు పేర్కొన్నారు. రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి మాట్లాడుతూ.. రాపిడో సేవలను 22-40% వరకూ మహిళలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. పాలసీ బజార్‌ సహ వ్యవస్థాపకుడు అలోక్‌ బన్సాల్‌ మాట్లాడుతూ.. తమ సంస్థను స్థాపించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, 2014 తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు