హెచ్‌సీఎల్‌ టెక్‌కు స్విస్‌ కంపెనీ కాంట్రాక్ట్‌

స్విట్జర్లాండ్‌కు చెందిన నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవల సంస్థ ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ నుంచి కాంట్రాక్ట్‌ దక్కించుకున్నట్లు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది.

Published : 29 Nov 2022 01:42 IST

దిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవల సంస్థ ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ నుంచి కాంట్రాక్ట్‌ దక్కించుకున్నట్లు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది. ఈ కాంట్రాక్టు కాలపరిమితి పలు ఏళ్ల పాటు ఉండనుంది. ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ కార్యకలాపాలను డిజిటల్‌కు మార్చడానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ తోడ్పడనుంది. ఐరోపా, అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో భాగస్వాములు, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల నెట్‌వర్క్‌తో ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా ఖాతాదార్లకు విమాన ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్‌, విడిభాగాలకు పూర్తి కస్టమైజ్డ్‌ సొల్యూషన్లను అందిస్తోంది. వ్యాపార అవసరాలను అందుకోవడానికి ఎస్‌ఏపీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ సంయుక్త సొల్యూషన్లు అవసరమని ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్యాట్రిక్‌ కస్టర్‌ అన్నారు. కాంట్రాక్టులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌పై సరికొత్త ఎస్‌ఏపీ టెక్నాలజీని హెచ్‌సీఎల్‌ టెక్‌ రూపొందించనుంది.

నిధుల సమీకరణ యోచనలో ‘ధృవ స్పేస్‌’

హైదరాబాద్‌: వచ్చే రెండేళ్లలో తన విస్తరణ కార్యకలాపాల కోసం 20- 25 మి.డాలర్లు (దాదాపు రూ.200 కోట్లు) సమీకరించాలని అంతరిక్ష ప్రయోగాల విభాగానికి చెందిన ధృవ స్పేస్‌ ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల రెండు చిన్న ఉపగ్రహాలను (థైబోల్ట్‌-1, థైబోల్ట్‌-2) అంతరిక్షంలోకి పంపిన విషయం విదితమే. సమీప భవిష్యత్తులో 100 కిలోల బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలనేది తమ లక్ష్యమని, అందుకు అవసరమైన సత్తా, సదుపాయాలు సమకూర్చుకునే పనిలో ఉన్నట్లు  ధృవ స్పేస్‌ సహ-వ్యవస్థాపకుడు, సీటీఓ అభయ్‌ ఎగోర్‌ తెలిపారు. కమ్యూనికేషన్లు, ఇతర శాస్త్రీయ పరిశోధనలకు వీలుకల్పించే 30 కిలోల బరువు తూగే ఉపగ్రహాలను ప్రయోగించడానికి తాము సిద్ధమవుతున్నట్లు, పీ30 ప్లాట్‌ఫామ్‌పై ఈ ప్రయోగాలు చేపడతామని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఈ సంస్థ 8 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి సమీకరించింది. తాము పంపిన చిన్న ఉపగ్రహాలు బాగా పనిచేస్తున్నాయని, సంకేతాలు పంపుతున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని