ఆర్థిక మోసాల నియంత్రణకు ట్రాయ్‌ అడుగులు

ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఇతర నియంత్రణ సంస్థలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో పాటు ఇబ్బందికర కాల్స్‌, సందేశాలను గుర్తించడానికి వివిధ సాంకేతికతలపై పని చేస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సోమవారం వెల్లడించింది.

Published : 29 Nov 2022 01:42 IST

ఇబ్బందికర కాల్స్‌, సందేశాల గుర్తింపునకు సాంకేతికత

దిల్లీ: ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఇతర నియంత్రణ సంస్థలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో పాటు ఇబ్బందికర కాల్స్‌, సందేశాలను గుర్తించడానికి వివిధ సాంకేతికతలపై పని చేస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సోమవారం వెల్లడించింది. అవాంఛిత వాణిజ్య కమ్యూనికేషన్‌ (యూసీసీ) లేదా ఇబ్బందికర కమ్యూనికేషన్‌ ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలంగా ఉంటోందని, వ్యక్తుల గోప్యతకు ఇది ఆటంకం కలిగిస్తోందని ట్రాయ్‌ అభిప్రాయపడింది. నమోదు కాని టెలీమార్కెటర్లకు (యూటీఎం) వ్యతిరేకంగా ఫిర్యాదులు రావడంతో ట్రాయ్‌ ముందడుగు వేసింది. యూసీసీ ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు అదనంగా యూసీసీ కాల్స్‌ కూడా ఆందోళనకరంగా మారాయని, ఈ రెండింటినీ సమానంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్రాయ్‌ పేర్కొంది. వివిధ సంస్థల సమన్వయంతో యూటీఎంల నుంచి వస్తున్న యూసీసీలను తనిఖీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)లను వినియోగించుకుని యూసీసీ పరిశోధన వ్యవస్థను అమలు చేయడం, డిజిటల్‌ సమ్మతి సముపార్జన సదుపాయం కల్పించడం, హెడర్లు, మెసేజ్‌ టెంప్లేట్స్‌ను తెలివిగా స్క్రబ్బింగ్‌ చేయడం వంటివన్నీ ఇందులో భాగమేనని వివరించింది. ఇబ్బందికరమైన కాల్స్‌, సందేశాల ముప్పును అరికట్టడానికి టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌-2018ను ట్రాయ్‌ జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని